
పోతిరెడ్డిపాడును పరిశీలించిన కేఆర్‌ఎంబీ చైర్మన్
జూపాడుబంగ్లా/పాములపాడు: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థలను కృష్ణా రివర్ మేనేజ్‌మెంటు బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్ బీపీ పాండే, కమిటీ మెంబర్ కేకే జాన్‌గిడ్ పరిశీలించారు. పోతిరెడ్డిపాడు కొత్త, పాత హెడ్‌రెగ్యులేటర్‌లను జలవనరులశాఖ నంద్యాల జిల్లా ఎస్‌ఈ ప్రతాప్ చూపించారు. పాత హెడ్‌రెగ్యులేటర్ శిథిలమైనందున కొత్త దాని ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. మొత్తం 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకొనే అవకాశం ఉన్నా ప్రస్తుతం 30 వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నామని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటిని బానకచర్ల నీటినియంత్రణ సముదాయం నుంచి తెలుగుగంగ, కేసీ ఎస్కేప్, గాలేరునగరి సుజలశ్రవంతి కాల్వలకు సరఫరా చేస్తామని కమిటీ ఛైర్మన్, మెంబర్‌కు తెలిపా రు. ఇప్పటిదాకా పోతిరెడ్డిపాడు నుంచి 130టీఎంసీల నీటిని విడుదల చేశారమని వివరించారు.
ఏపీ ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీ పరిధిలో లేవు
కేఆర్‌ఎంబీ చైర్మన్‌గా బీపీ పాండే కొత్తగా బాధ్యతలు చేపట్టినందున ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు ఎస్‌ఈ ప్రతాప్ విలేకరులకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించలేదని, ఏపీలోని ప్రాజెక్టులు కూడా కేఆర్‌ఎంబీ పరిధిలో లేవన్నారు. పర్యవేక్షణలో భాగంగా వారు ప్రాజెక్టులను పరిశీలించి నీటివిడుదల వివరాలను తెలుసుకొంటున్నట్లు తెలి పారు. కేఆర్‌ఎంబీ ఆదేశాలను లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రం ఎడాపెడా విద్యుత్‌ను ఎందుకు ఉత్పత్తిచేస్తోందని విలేకరులు ప్రశ్నించగా ఆయన సమాధానం దాటవేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా కాకుండా తెలంగాణ రాష్ట్రం 2,500 క్యూసెక్కుల కన్నా ఎక్కువ నీటిని వినియోగించుకొనే అవకావం లేదని పేర్కొన్నారు. వీరి వెంట తెలంగాణ కేఆర్‌ఎంబీ ఏడీఈ పవన్, ఏఈ రాజశేఖర్, పోతిరెడ్డిపాడు పర్యవేక్షణ ఈఈ నాగేంద్రకుమార్, డీఈలు సుబ్రమణ్యంరెడ్డి, నగేష్, రఘురాంరెడ్డి, జేఈలు విష్ణువర్ధన్‌రెడ్డి, తిమ్మారెడ్డి, దేవేంద్ర ఉన్నారు.