
గ్రేడింగ్ పేరుతో రైతుకు అన్యాయం
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లికి మద్దతు ధర కల్పిస్తున్నామంటూనే గ్రేడింగ్ పేరుతో ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోంది. ఓ రైతు మంగళవారం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు 95 ప్యాకెట్ల ఉల్లి తెచ్చాడు. ఉల్లిలో నాణ్యత లేదని నాలుగు సార్లు గ్రేడింగ్ చేయించి 35 ప్యాకెట్లు పక్కన పోశారు. మిగతా 60 ప్యాకెట్లకు మాత్రమే మద్దతు ధర రూ.1,200 చొప్పున మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. ఇష్టారాజ్యంగా గ్రేడింగ్ చేయిస్తుండటం వల్ల మద్దతు ధర కల్పించినా ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు. ఉల్లిలో నాణ్యత ఉండాల్సిందేనని, అయితే ఒకసారి గ్రేడింగ్ చేయిస్తే సరిపోతుందని, మూడు, నాలుగు సార్లు గ్రేడింగ్ చేయిస్తుండటం సరికాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్క్‌ఫెడ్ మద్దతు ధరతో ఉల్లి కొనుగోలు చేయాలంటే ముందుగా ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులు నాణ్యతను ధ్రువీకరించాలి. నాణ్యత లేకపోతే గ్రేడింగ్ చేయించాలి. అయితే ఎక్కువ సార్లు గ్రేడింగ్ చేయించడం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది.