
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచండి
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకునేందుకు, నాణ్యమైన దిగుబడులు పొందేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. మంగళవారం మద్దూరునగర్‌లోని ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో భూమి సారవంతమవుతుందన్నారు. ఫలితంగా దిగుబడులు నాణ్యతతో ఉంటాయన్నారు. విచ్చిలవిడిగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూమి ఆరోగ్యం దెబ్బతిని, పంటలకు చీడపీడల బెడద పెరుగుతోందన్నారు. నేలను సారవంతం చేసేందుకు ఘన, ద్రవ జీవామృతంతో పాటు నవధాన్యాలు సాగు చేయాలని సూచించారు. ప్రధాన పంటల్లో అంతరపంటలు సాగు చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో విశేషంగా రాణిస్తున్న 12 మందికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. సమావేశంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మాధురీ, సీనియర్ కన్సల్టెంట్ రాజేశ్వర్, జిల్లా కన్సల్టెంట్ లక్ష్మయ్య, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సంజీప్‌కుమార్ పాల్గొన్నారు.