
డోన్: పట్టణంలో బుధవారం జరిగే రాష్ట్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కుమారుడు అర్జున్ అమర్నాథ్‌రెడ్డి, మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి ముని మనవరాలు అనన్యరెడ్డి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. తాడేపల్లిలోని హెలిపాడ్ నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి డోన్ పట్టణ శివారులోని ఎం కన్వెన్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు 11.40 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంబాలపాడు సర్కిల్, ఉడుములపాడు మీదుగా 44వ జాతీయ రహదారిపై స్థానిక దత్తాత్రేయ స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన వివాహ రిసెప్షన్ వేదికకు చేరుకుంటారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి తిరిగి కారులో ఎం కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుని అనంతరం హెలికాప్టర్‌లో బెంగళూరుకు 12.20కి ప్రయాణమవుతారు.
ఏర్పాట్ల పరిశీలన..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఎం కన్వెన్షన్ హాల్ వద్ద నిర్మించిన హెలిపాడ్‌తో పాటు దత్తాత్రేయ స్వామి గుడి ఆవరణలో నిర్మించిన వివాహ రిసెప్షన్ వేదిక, భోజనశాల షెడ్లను మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. సుమారు 40 వేల మంది ప్రజలకు వివాహ విందు ఏర్పాటు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. మాజీ మంత్రి వెంట పట్టణ, రూరల్ సీఐలు ఇంతియాజ్ బాషా, రాకేష్, ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు ఉన్నారు.