
జీఎస్టీ తుస్.. డిప్ ‘ధనా’ధన్!
● టపాసుల అంగళ్ల ఏర్పాటుకు
కొత్తగా డిప్ పద్ధతి
● నంద్యాలలో 63 షాపులకు
రూ.29.61లక్షల వసూలు
నంద్యాల(అర్బన్): జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా.. రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గతేడాది కంటే ఈ ఏడాది టపాసుల అంగళ్ల ఏర్పాటుకు అధిక మొత్తాలను వసూలు చేస్తున్నారు. ఇదంతా దారుణం అని షాపుల యజమానులు వాపోతున్నారు.
ప్రభుత్వ నిర్ణయం ఇలా..
రెవెన్యూ, పోలీసులు, మున్సిపల్, ఫైర్, విద్యుత్ తదితర శాఖల నుంచి ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)తో పాటు రూ.500 చలానా చెల్లిస్తే ఆర్‌డీఓ కార్యాలయంలో డిప్ పద్ధతి ద్వారా టపాసుల స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ గ్రౌండ్‌లో 63 స్టాల్స్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందు కోసం ఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహించాల్సిన స్టాల్స్ ఏర్పాటు డిప్ సిస్టమ్‌ను కొన్ని కారణాల వల్ల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఇందు కోసం ఉదయం 10గంటల నుంచి స్టాల్స్ ఏర్పాటు దారులు డిప్ సిస్టమ్ కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సాయంత్రం 5.30గంటలకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులుల ఆధ్వర్యంలో 62 స్టాల్స్ ఏర్పాటుకు డిప్ సిస్టమ్‌ను నిర్వహించారు.
వసూళ్లు ఇలా..
ఎన్‌ఓసీ సర్టిఫికెట్లు లేక పోవడంతో డిప్ సిస్టమ్‌లో పాల్గొనేందుకు అర్హులు కాదంటూ 21 మందిని కొద్ది సేపు నిలిపి వేశారు. అనంతరం సొంత పూచీకత్తు మీద వారిని డిప్‌లో పాల్గొనాలని సూచించారు. మొత్తం మీద 62 స్టాల్స్ మాత్రం డిప్ ద్వారా నంబర్లు కేటాయించారు. అయితే ఒక్కో షాపుకు రూ.47 వేలు చొప్పున వసూలు చేస్తున్నారని షాపు యజమానులు వాపోయారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.500 చెల్లిస్తే షాపు కేటాయిస్తారని చెబుతున్న ప్రకటనలు పేపర్లకే పరిమితం అయ్యాయని ఆరోపిస్తున్నారు. దాదాపు 63 షాపులకు రూ.29.61లక్షలు అవుతున్న మొత్తం ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ నేత హస్తం
నంద్యాల పట్టణంలోని ఒక టీడీపీ నేత ఈ మొత్తాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన మొత్తాన్ని పలు శాఖలు, ప్రజాప్రతినిధులకు కొంత మొత్తాన్ని కేటాయించి మొగిలిన మొత్తాన్ని స్వాహా చేయనున్నట్లు షాపుల కేటాయింపు పొందిన పలువురు ఆరోపిస్తున్నారు. జీఎస్టీ తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా గత ఏడాది కంటే ఈ ఏడాది షాపుల యజమానులపై ఈ విధంగా అంత మొత్తాలను మోపడం దారుణమని వాపోతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాసులును వివరణ కోరగా ఏ షాపు యజమాని అయినా రూ.47వేలు చెల్లిస్తున్నామని ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రూ.500 చలానా చెల్లిస్తే చాలు షాపులు కేటాయిస్తున్నామని, అధిక మొత్తలు వసూలు చేస్తున్నామనడంలో అర్థం లేదన్నారు.

జీఎస్టీ తుస్.. డిప్ ‘ధనా’ధన్!