
కలం.. నిరసన గళం
నంద్యాల: ప్రజల పక్షాన నిలుస్తూ ప్రభుత్వ అక్రమాలను, వైఫల్యాను ఎండగడుతున్న జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్నారు. సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డితో పాటు ఇతర పాత్రికేయులపై నమోదు చేసి అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలు తక్షణమే నిలిపి వేయాలి. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని పోలీసులు వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రభుత్వాలు కాదు. అక్షరం శాశ్వతమన్నది పోలీసులు గుర్తెరగాలి. మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం, పత్రికా ఎడిటర్‌పై తప్పుడు కేసులు నమోదు చేయడం మంచి పద్ధతి కాదు. ఇది ఒక్క సాక్షిపైనే కాదు పత్రికా రంగంపైనే దాడి. పోలీసులను పాత్రికేయులపై ఉసిగొల్పుతున్నారు. జర్నలిస్టు సంఘాలు చూస్తూ ఊరుకోవు.
–పీ.ఎం. లక్ష్మినరసింహం, ఏపీయూడబ్ల్యూజే
జిల్లా అధ్యక్షుడు, నంద్యాల
ప్రజల పక్షాన గొంతుకగా నిలుస్తున్న జర్నలిజానికి సంకెళ్లు వేయాలనుకోవడం అవివేకం. పోలీసులను అడ్డుపెట్టుకొని యథేచ్చగా ప్రజల హక్కులు, విలువలను కాలరాయాలనుకోవడం తగదు. నిజాలు చెప్పే మీడియా సంస్థలపై దాడి చేయడం దుర్మార్గపు చర్య. రాష్ట్రాన్ని నకిలీ మద్యం పట్టి పీడిస్తూ అమాయకుల ప్రాణాలు హరిస్తున్నా ప్రభుత్వం చోద్యం చూడటం తగదు. నకిలీ మద్యంపై వార్తలు రాస్తే ఎడిటర్, జర్నలిస్టులపై కేసు నమోదు చేయడంలో అర్థం లేదు. ప్రభుత్వం పునరాలోచన చేయాల్సి ఉంది.
– శివనాగిరెడ్డి, ఏపీ ఎన్‌జీఓస్ ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షుడు, నంద్యాల

కలం.. నిరసన గళం

కలం.. నిరసన గళం