
సీమ ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నీరు విడుదల చేయాలి
నంద్యాల(అర్బన్): రాయలసీమ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు నేటికి పూర్తి కాకపోవడం, పంట కాల్వలు లేకపోవడంతో ప్రాజెక్టుల కింద ఉన్న లక్షలాది ఎకరాలకు నేటికి సాగునీరు అందలేదన్నారు. వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియజేసేందుకు ఆలోచన పరుల వేదిక నాయకులు విశ్రాంత ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో రైతు సేవా సంస్థ అధ్యక్షుడు భవానీప్రసాద్ సాగునీటి రంగ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, సామాజిక వేత్త రామారావు రాకపై ఆదివారం స్థానిక కార్యాలయంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులకు సాధారణం కంటే నెల రోజుల ముందే వరదలు వచ్చినా సీమ ప్రాజెక్టులకు ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని దిగువకు విడుదల చేయడం అన్యాయమన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా గాలేరునగరి, ఎస్సార్బీసీ, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలన్నారు. ప్రకృతి కనికరించి కృష్ణా, తుంగభద్ర జలాలు సీమ ముగింట చేరినా నీటిని పొందలేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లదీస్తుందని, సీమ రైతులకు అవసరమైన నీటిని తక్షణమే అందించి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వైఎన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరనాయుడు, సుధాకర్‌కుమార్, అసదుల్లా, భాస్కరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.