
పరిశ్రమలు ఎక్కడ బాబూ..!
జూపాడుబంగ్లా: పరిశ్రమలతో కళకళలాడాల్సిన భూములు వెలవెలబోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో తంగడంచ ఎంఎస్‌ఎంఈ పార్క్ చిన్నబోయింది. తొమ్మిదేళ్లు అయినా ఒక్క పరిశ్రమను స్థాపించటానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తండగంచ గ్రామ సమీపంలో కేజీ రోడ్డు నుంచి 1.25 కిలోమీటర్ల దూరంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఉన్నా అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. 2016లో దాదాపు 211 ఎకరాల తంగడంచ ఫారం భూములను అప్పట్లో సీఎం చంద్రబాబునాయుడు గుజరాత్ అంబుజా పరిశ్రమకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమ స్థాపన నిమిత్తం కర్నూలు–గుంటూరు రోడ్డు నుంచి రూ.3.09 కోట్ల ప్రత్యేక అభివృద్ది నిధులతో 1.25 కిలోమీటర్ల మేర రెండులైన్ల రోడ్డును నిర్మించారు. అయితే అంబుజా కంపెనీవారు కాలు పెట్టకుండానే వెనుదిరగటంతో ఆ భూములను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ సంస్థ (ఏపీఐఐసీ)కు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీకి కేటాయించిన 211 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ (మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) పార్కులో చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా రూ.7కోట్లతో అంతర్గత బీటీరోడ్లు, డ్రైనేజీలు, త్రీఫేస్ విద్యుత్ సరఫరా నిమిత్తం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. 211 ఎకరాల్లో 50 ఎకరాలను స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీస్ స్థాపించేందుకు ఏడు, పది సెంట్ల ప్రకారం 260 ప్లాట్లను ఏర్పాటుచేశారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారిలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 30 శాతం చొప్పున ప్రాధాన్యతనిస్తూ చదరపు మీటరు రూ.840 చొప్పున స్థలాన్ని కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరిశ్రమల స్థాపనపై ఏపీఐఐసీ అధికారులు పారిశ్రామికవేత్తలకు, నిరుద్యోగులకు అవగాహన కల్పించకపోవటంతో రూ.12కోట్ల నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కు స్థలాల్లో తొమ్మిదేళ్లు గడిచినా ఒక్క పరిశ్రమ స్థాపించకపోవటాన్ని బట్టిచూస్తే అధికారుల పనితీరు అర్థం చేసుకోవచ్చుననే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఎంఎస్‌ఎంఈ పార్కు లేఅవుట్ చిత్రపటం
అవగాహన కల్పించే వారు లేక..
పరిశ్రమల ఏర్పాటుపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పించడడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. పరిశ్రమలు స్థాపించుకునే వారికి ఎంఎస్‌ఎంఈలో స్థలం కేటాయించాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి సవాలక్ష ఆంక్షలు విధి ంచటంతో కొంత మందికి అవగాహన లేకపోవడంతో మొదట్లోనే వెనుకడుగు వేస్తున్నారు. దరఖాస్తు చేసినా కొన్ని నిబంధనలతో తిరస్కారానికి గురవుతున్నాయి. ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలకు తంగడంచ ఫారంలో పరిశ్రమలు స్థాపించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిరుద్యోగులు, నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
భూముల అధిక ధరలు.. ఆసక్తి చూపని పారిశ్రామికవేత్తలు
బంగారు పంటలు పండే తంగడంచ ఫారంలోని నల్లరేగడి భూములను ప్రభుత్వం నుంచి ఏపీఐఐసీ ఎకరా రూ.4.50లక్షల చొప్పున కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్లో ఎకరా ఫారం భూమి ధర రూ.15 నుంచి రూ.20 లక్షల ఉంటుంది. ఏపీఐఐసీ మాత్రం చదరపు మీటరు రూ.840 ప్రకారం పారిశ్రామిక వేత్తలకు ఇస్తుంది. ఈ లెక్కన ఎకరా భూమి విలువ రూ.33.98 లక్షలు అవుతుంది. కొన్నదానికంటే అత్యధిక ధరకు విక్రయిస్తుండటంతో పాటు ఏడాదిలోగా పరిశ్రమను స్థాపించకపోతే ఇచ్చిన భూమిని వెనక్కితీసుకొంటామనే పలు నిబంధనలను విఽధించటంతో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి.
తంగడంచ ఎంఎస్‌ఎంఈ పార్క్ వెలవెల
పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించని ఏపీఐఐసీ అధికారులు
తొమ్మిదేళ్లల్లో ఒక్క పరిశ్రమ రాని వైనం
ఎంఎస్‌ఎంఈ స్థలాలు నిరుపయోగం

పరిశ్రమలు ఎక్కడ బాబూ..!

పరిశ్రమలు ఎక్కడ బాబూ..!