
భ్రామరీ సమేత మల్లన్నకు ఊయల, పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో లోక కల్యాణం కోసం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం శ్రీస్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించి, మహా గణపతిపూజ జరిపించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీ లో ఆశీనులను చేసి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు. అలాగే ఊయలలో స్వామిఅమ్మవార్లను ఉంచి షోడశోపచార పూజలు నిర్వహించారు.
తిరుమల అన్నదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
కోవెలకుంట్ల: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన ట్రస్టుకు కోవెలకుంట్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంగళవారం విరాళం అందజేశారు. నిత్యాన్నదాన ట్రస్టుకు తమ వంతు సాయంగా ఉపాధ్యాయుడు నాగరాజు, వరలక్ష్మి దంపతులు రూ.10 లక్షల చెక్కును టీటీడీ ఏడీఎల్ ఈఓ వెంకయ్య చౌదరికి అందజేసి ఔదార్యం చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రెండు పర్యాయాలు రూ.10 లక్షల చొప్పున అన్నదాన ట్రస్టుకు విరాళం అందించినట్లు తెలిపారు.
సమస్యలపై బుగ్గన ఆరా
బేతంచెర్ల: ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు తదితర విషయాలపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, నాయకులు ముర్తుజావలి, ఖాజా గూని నాగరాజు, రామచంద్రుడు, మురళీ కృష్ణ, పిట్టల జాకీర్, తిరుమలేశ్వర్ రెడ్డి, వెంకి రెడ్డి, నారాయణ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలన తీరుపై చర్చించారు. ముఖ్యంగా రైతులకు విత్తనాలు, ఎరువులు అందుతున్నాయా? వ్యవసాయ దిగుబడులకు మద్దతు ధర లభిస్తుందా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డోన్ పట్టణంలో బుధవారం జరిగే తన తనయుడు బుగ్గన అర్జున్‌రెడ్డి వివాహ రిసెప్షన్ వద్దకు వచ్చే ప్రజలు, నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా చేరుకోవాలని సూచించారు.

భ్రామరీ సమేత మల్లన్నకు ఊయల, పల్లకీ సేవ

భ్రామరీ సమేత మల్లన్నకు ఊయల, పల్లకీ సేవ