
కూటమి ప్రభుత్వం విఫలం
నంద్యాల(న్యూటౌన్): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప విమర్శించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అధ్యక్షతన ‘రండి.. టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిన్న నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ.35 వేల కోట్లు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి ఉందన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాలుగా ఉద్యోగులకు ఇచ్చి బకాయిలను చెల్లించాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, శ్రీనివాసులు, తిరుపాలు, ఫకృద్దీన్, సునిల్‌కుమార్, విజయలక్ష్మి, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.