
పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యసేవలు అందించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
గోస్పాడు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందజేయాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గోస్పాడులోని పీహెచ్‌సీని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు శ్రేయస్కరం అని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య కేంద్ర ఆవరణలో పరిశుభ్రతను పాటించాలన్నారు. అనంతరం వైద్య చికిత్స కోసం వచ్చిన వారితో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రోగులకు సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయా, లేదా, గడువు తేదీ ముగిసిన ఔషధాలను ఏం చేస్తున్నారు అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
రైతు సేవాకేంద్రం పరిశీలన..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ అనంతరం సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పంటలకు సరిపడా యూరియా మాత్రమే వినియోగించేలా రైతులకు అవగాహన కల్పింలన్నారు. అనంతరం గోస్పాడుతలోని శ్రీ వెంకట సాయి ప్రైవేటు ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే చట్ట పరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
శ్రీశైలం డ్యాం నీటిమట్టం 880.70 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటిమట్టం బుధవారం సాయంత్రం సమయానికి 880.70 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 191.6512 టిఎంసీల నీరు నిల్వ ఉంది. మంగళవారం నుంచి బుధవారం వరకు శ్రీశైలానికి ఎగువ జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్‌ల నుంచి 69,457 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 1,10,948 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్‌కు 69,323 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 35వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 3,225 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాలలో 18.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
చేపల పెంపకంపై మూడు నెలల శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 7వ తరగతి చదివిన నిరుద్యోగులకు చేపల పెంపకంపై మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగనాథబాబు తెలిపారు. స్థానిక బంగారుపేటలోని దేశీయ మత్స్య శిక్షణా కేంద్రంలో సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు 144వ జట్టుకు శిక్షణ ఇస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ నెల 29లోగా దరఖాస్తులను బంగారుపేటలోని తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ నెల 30న ఽఉదయం 10.30 గంటలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావా లని కోరారు.