చేయూత కరువై.. చేనేత చిక్కుముడై! | - | Sakshi
Sakshi News home page

చేయూత కరువై.. చేనేత చిక్కుముడై!

Aug 7 2025 9:51 AM | Updated on Aug 7 2025 9:51 AM

చేయూత

చేయూత కరువై.. చేనేత చిక్కుముడై!

పాత పథకానికి కొత్త ‘షో’కు

ఒక్క హామీ నెరవేర్చని

కూటమి ప్రభుత్వం

హామీలు మాటలకే పరిమితం

జీఓలు విడుదల చేస్తున్నా

అమలు కరువు

ఉమ్మడి జిల్లాలో రాణించిన

4,148 చేనేత కుటుంబాలు

కూటమి ప్రభుత్వంలో

2,842 కుటుంబాలకే పరిమితం

గత ప్రభుత్వంలో ఆదుకున్న

వైఎస్సార్‌ నేతన్న నేస్తం

నేడు జాతీయ చేనేత దినోత్సవం

చేనేతలకు పొదుపు నిధి ఎప్పటి నుంచో అమలులో ఉంది. చేనేత సహకార సంఘాల్లో పనిచేసే కార్మికులకు చెల్లించే వేజ్‌లో పొదుపు కింద 8 శాతం కట్‌ చేస్తే, దానికి 16 శాతం ప్రభుత్వం కలుపుతుంది. దీనినే పొదుపు నిధిగా వ్యవహరిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం తామే ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించుకోవడం విమర్శలకు తావిస్తోంది.

కర్నూలు(అగ్రికల్చర్‌) : ఒకప్పుడు వ్యవసాయ రంగం తర్వాత చేనేత పరిశ్రమ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2023–24 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 4,148 చేనేత కుటుంబాలు ఉండగా.. అప్పటి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కింద నెలకు రూ.2వేల ప్రకారం ఏడాదికి రూ.24 వేల ఆర్థిక తోడ్పాటును అందించింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోవడంతో ఈ స్వల్ప కాలంలోనే 1,306 కుటుంబాలు చేనేత వృత్తికి స్వస్తి పలకడం గమనార్హం. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఉమ్మడి జిల్లాలో కేవలం 2,842 కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోంది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చేనేత పరిశ్రమ మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

చేయూత కోసం ఎదురు చూపులు

కూటమి ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలు గడుస్తున్నా చేనేత కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యలు ఒక్కటంటే ఒక్కటీ లేదు. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసుకునేందుకు నెలకు 200 యూనిట్‌ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని, చేనేతకార్మికుల ఆరోగ్య భద్రతకు బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. చేనేతలకు భారంగా మారిన జీఎస్టీని ఎత్తి వేస్తామని, ఇది సాద్యం కాకపోతే కట్టిన జీఎస్‌టీని వెనక్కు ఇస్తామన్నా ఉలుకూపలుకూ లేదు. చేనేత కార్మికులు ఇళ్లు నిర్మించుకుంటే మగ్గం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా మామూలుగా ఇచ్చే రూ.4.30 లక్షలకు అదనంగా రూ.50 వేలు చెల్లిస్తామన్న హామీ మాటలకే పరిమితమైంది. కార్మికుల ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తెస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చని పరిస్థితి.

నేడు జాతీయ చేనేత దినోత్సవం

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండవ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఈ నెల 7న నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లాకు సంబందించి ఎమ్మిగనూరులోని కుర్ని ఫంక్షన్‌ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లాకు సంబంధించి బనగానపల్లి మండలం నందివర్గంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.

కూటమి ప్రభుత్వంలో అరకొర బడ్జెట్‌

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాసనసభలో రెండు సార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. అయితే రెండేళ్లలో చేనేతలకు కేటాయించిన బడ్జెట్‌ రూ.10 కోట్లు మాత్రమే. నామమాత్రపు బడ్జెట్‌తో చేనేతల సంక్షేమం ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నేతన్న సంక్షేమానికి ఏటా రూ.200 కోట్లు కేటాయించింది. ఐదేళ్లలో రూ.1000 కోట్లు వెచ్చించిన విషయాన్ని చేనేతలు గుర్తు చేసుకుంటున్నారు.

వైఎస్సార్‌సీపీ పాలనలో చేనేతలకు రూ.47.58 కోట్ల ఆర్థిక తోడ్పాటు

ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసి చూపించారు. రెండేళ్లు కరోనాతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన్పటికీ ఎక్కడా రాజీపడకపోవడం విశేషం. చేనేత మగ్గాలను అభివృద్ధి చేసుకోవడం, ఇతర మౌలిక సదుపాయాలతో సమర్థవంతంగా రాణించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతినెలా రూ.2వేలు చొప్పున ఏడాదికి రూ.24వేలు చెల్లించింది. ఒక్కో చేనేత కుటుంబానికి ఐదేళ్లలో రూ.1.20 లక్షల ఆర్థిక లబ్ధి చేకూరింది. ఐదేళ్లలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేనేతలకు రూ. 47.58 కోట్ల ఆర్థిక తోడ్పాటు లభించింది.

చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.36 వేలు చెల్లించాలి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లు వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసింది. నెలకు రూ.2వేల ప్రకారం ఏడాదికి రూ.24 వేలు చేయూతనిచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం చేనేతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడాదికి రూ.36 వేల ప్రకారం తోడ్పాటును అందించాలి. అద్దె మగ్గాలకు కూడా ఈ సాయాన్ని వర్తింపజేయాలి. 40 శాతం సబ్సిడీపై యార్న్‌ సరఫరా చేయాలి. – బి.మాధవస్వామి,

రాష్ట్ర అధ్యక్షుడు, చేనేత కార్మిక సంఘం

జీఓలు ఇవ్వడమే తప్ప కార్యాచరణ కరువు

2014–15 నుంచి 2018–19 వరకు చేనేతకారుల సంక్షేమం మాటల్లో ఊదరగొట్టడం.. జీఓలు విడుదల చేయడం మినహా ఒక్కటీ కార్యరూపం దాల్చని పరిస్థితి.

చేనేతల సంక్షేమానికి విడుదల చేసిన జీఓల విలువ దాదాపు రూ.200 కోట్లు. అయితే కాగితాలకే పరిమితమైంది.

100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, ప్రతి ఏటా చేనేతకారులకు వేజ్‌లాస్‌ కింద నెలకు రూ.2వేల ప్రకారం మూడు నెలల పాటు పరిహారం ఇచ్చేందుకు జీఓలతో సరిపెట్టారు.

ఒకప్పుడు జిల్లాలో రూ.200 కోట్ల వరకున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి టీడీపీ హయాంలో రూ.40 కోట్లకు పడిపోయింది.

ఒకప్పడు ఉమ్మడి జిల్లాలో 45 చేనేత సహకార సంఘాలు ఉండగా.. నేడు ఏడుకు పడిపోవడం గమనార్హం.

చేయూత కరువై.. చేనేత చిక్కుముడై!1
1/2

చేయూత కరువై.. చేనేత చిక్కుముడై!

చేయూత కరువై.. చేనేత చిక్కుముడై!2
2/2

చేయూత కరువై.. చేనేత చిక్కుముడై!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement