
కొండెక్కిన కొబ్బరి.. చేదెక్కిన బెల్లం!
నంద్యాల(న్యూటౌన్): నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కాయి. ఎర్రగడ్డలు, ఎండుమిరప పప్పు, ఉప్పు, బెల్లం, అల్లం.. అన్ని నిత్యావసర సరకులు ప్రియం అయ్యాయి. కూరగాయల ధరలు అమాంతంగా పెరిగి సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మార్కెట్‌కు రూ.100 నోటు తీసుకుని వెళితే కనీసం రెండు రోజులకు సరిపడా కూరగాయలు కొనలేని దుస్థితి నెలకొంది. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో కూరగాయల సాగు ప్రారంభం కాలేదు. దీంతో మిర్చి, క్యారెట్, బీట్ రూట్, బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్ ధరలు చుక్కలను చూపుతున్నాయి.
రైతు బజార్లు ఏవీ?
నంద్యాల పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. పట్టణంలో, మండల కేంద్రంలో మరి కొన్ని రైతు బజార్లు ఏర్పాటు చేసినట్లయితే రైతులు నేరుగా తీసుకువచ్చి ప్రజలకు కూరగాయలు అమ్ముకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే ఇష్టారాజ్యంగా మారింది. కూరగాయల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఉద్దానంలో పండే బీర, కాకర, సొర, బెండ కాయలు ఆగస్టు నెలాఖరు నాటికి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ధరలపై నియంత్రణ ఉండేలా రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే తాత్కాలికంగానైనా రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నిత్యావసర ధరలు ఇవీ..
(కిలోకు రూపాయల్లో..)
గతేడాది ప్రస్తుతం
కొబ్బర 180 350
ఎండు మిర్చి 120 160
చింతపండు 100 140
బెల్లం 50 65
పామాయిల్ 90 120
సన్‌ఫ్లవర్ 112 145
కూరగాయల ధరలు ఇవీ...
(కిలోకు రూపాయల్లో..)
ప్రస్తుతం గత
మూడు
రోజుల
క్రితం బీన్స్ 120 100
చిక్కుడు 80 60
క్యాప్సికం 100 80
క్యారెట్ 70 50
కాకర 60 40
బీర 60 40
బీట్‌రూట్ 60 50
వంకాయాలు 60 40
దొండ 60 40
మిర్చి 100 40
బెండ 50 40
క్యాలీఫ్లవర్ 100 80
టమాటా 60 40
ధరలు మండిపోతున్నాయి
ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. సామాన్యులుగా మంచి కూరగాయల కొనలేకపోతున్నాం. ధరలను ప్రభుత్వం నియంత్రించకుంటే ఎలా? తోట కూర కట్ట రూ.20 అమ్ముతున్నారు. రెండు అరటి కాయలు రూ.20 పలుకుతున్నాయి. ధరలు ఆకాశాన్ని అంటడం బాధకరం. అధికారులు ధరలు నియంత్రించాలి. – లక్ష్మీదేవి, నంద్యాల
రైతు బజార్లు ఏర్పాటు చేయాలి
నంద్యాల పట్టణంలో రైతు బజార్లు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. పండించే కూరగాయలను రైతు బజార్లలో విక్రయాలు జరిగేలా చూడాలి. ప్రస్తుతం నంద్యాల మార్కెట్లో కూరగాయలు కొనలేకపోతున్నాం. కిలో బెండకాయులు రూ.50, ఆగాకర కాయలు రూ.280 చెబుతున్నారు. కొనేందుకు ధైర్యం చేయలేకపోతున్నాం.
– వెంకటేశ్వరమ్మ, నంద్యాల
భగ్గుమంటున్న నూనె ధరలు
సామాన్యుడికి కూర‘గాయాలు’

కొండెక్కిన కొబ్బరి.. చేదెక్కిన బెల్లం!