ఐదు రోజులైనా దొరకని బాలిక ఆచూకీ.. మృతదేహం కోసం విస్తృత గాలింపు | Andhra Pradesh: Search Operation Continues For Minor Girl Body At Muchumarri Village In Nandyal | Sakshi
Sakshi News home page

ఐదు రోజులైనా దొరకని బాలిక ఆచూకీ.. మృతదేహం కోసం విస్తృత గాలింపు

Jul 12 2024 1:54 AM | Updated on Jul 12 2024 12:00 PM

-

పంప్‌హౌస్‌ వద్ద బాలిక తల్లిదండ్రుల నిరీక్షణ

నిందితుల కుటుంబీకులను విచారించాలని డిమాండ్‌

నంద్యాల: పగిడ్యాల, కొత్త ముచ్చుమర్రి గ్రామంలో ఐదు రోజుల క్రితం చోటు చేసుకున్న బాలిక అదృశ్యం కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. రోజులు గడుస్తున్నాయే తప్పా బాలిక మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. గురువారం వైజాగ్‌ నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రెండు బృందాలను రప్పించి ప్రత్యేక కెమెరాలతో ముచ్చుమర్రి పంప్‌హౌస్‌ నీటిలో గాలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన గాలింపులో ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు.

‘దృశ్యం’ సినిమాలాగా నిందితులు రోజుకో సమాచారం చెప్పి పోలీసులను విచారణలో తప్పుదోవ పట్టిస్తున్నారేమోనని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఘటన ప్రదేశానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. క్షణం.. క్షణం ఉత్కంఠతో బాలిక బంధువులు, కుటుంబీకులు ఎదురుచూస్తూ పంప్‌హౌస్‌ వద్ద విషాదంలో మునిగిపోయారు. గాలింపు చర్యలను నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ రఘువీర్‌రెడ్డి పర్యవేక్షించారు.

అనంతరం బాధిత కుటుంబాన్ని కలెక్టర్‌ పరామర్శించారు. నేర నిర్ధారణ అయితే నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. ఐదు రోజులైనా తమ పాప ఆచూకీని కనిపెట్టలేదని, పోలీసుల అదుపులో ఉన్న నిందితులను చూపించాలని డిమాండ్‌ చేశారు. సాయంత్రంలోగా మృతదేహం ఆచూకీ కనిపెట్టాలని, ఎన్నాళ్లు సాగదీస్తారని అధికారులపై బాలిక బంధు వులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిందితుల కుటుంబీకులను పిలిచి పోలీసులకు ఎందుకు విచారించడం లేదని, మృతదేహం మాయంలో వారి హస్తం ఉంటుందని అనుమానాలను వ్యక్తం చేశారు. నిందితులు మైనర్లు కావడం వలన అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు చేపట్టాలని ఎస్పీకి ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్‌ బాధితులకు తెలిపారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి జిల్లా కలెక్టర్‌ను కలిసి బాలిక మృతదేహాం ఆచూకీని తొందరగా గుర్తించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్న బాలిక కుటుంబీకులు, బంధువులు 

నేరం రుజువైతే కఠిన చర్యలు..
బాలిక హత్య కేసులో మైనర్లు ఇచ్చిన సమాచారం మేరకు అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోందని, నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. గురువారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌లో బాలిక మృతదేహాం ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల చేపట్టిన గాలింపు చర్యలను కలెక్టర్‌ పర్యవేక్షించారు.

అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 8వ తేదీ నుంచి పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నారని తెలిపారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాల గాలింపులో పురోగతి సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామన్నారు. 

అనంతరం సీపీఐ జిల్లా నాయకులు రమేష్‌బాబు, జిల్లా మహర్షి వాల్మీకి రిజర్వేషన్‌ ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న, తాలుకా అధ్యక్షులు బోయ వెంకటరమణ నాయుడు, లాయర్‌ వెంకటరాముడు, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు బాధితులను శిక్షించాలని వినతి పత్రాలు అందజేశారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ దాసు, డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ నాగేశ్వరరావు ఉన్నారు.

నిందితుల తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలి..
నందికొట్కూరు: కొత్త ఎల్లాల గ్రామంలో బాలికను దారుణంగా హత్య చేసిన నిందితులు మైనర్లు కావడంతో వారి తల్లిదండ్రులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు, కుటుంబీకులు డిమాండ్‌ చేశారు. గురువారం పట్టణంలోని పోలీసు స్టేషన్‌కు ఎదురుగా వారు ధర్నా చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ ఐదు రోజులు గడిచినా తమ అమ్మాయి ఆచూకీ గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక మృతదేహాన్ని మాయం చేయడంలో నిందితుల తల్లిదండ్రుల పాత్ర ఉందని, వారిని ఇంత వరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదని మండిపడ్డారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement