సూరీడు సుర్రున.. మీటరు గిర్రున | - | Sakshi
Sakshi News home page

సూరీడు సుర్రున.. మీటరు గిర్రున

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

కేటగిరీల వారీగా విద్యుత్‌ కనెక్షన్లు

డొమెస్టిక్‌ 505629

కమర్షియల్‌ 75353

ఇండస్ట్రియల్‌ 4656

కాటేజీ 2255

అగ్రికల్చర్‌ 245552

వీధి దీపాలు 9891

జనరల్‌ 3473

టెంపరరీ సప్లయ్‌ 358

నెలవారీగా విద్యుత్‌

వినియోగం

(మిలియన్‌ యూనిట్లలో)

జూలై 499.00

ఆగస్టు 571.35

సెప్టెంబర్‌ 522.06

అక్టోబర్‌ 213.90

(13 రోజులు)

నల్లగొండ: జిల్లాలో విద్యుత్‌ డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు ఎండల తీవ్రత విద్యుత్‌ వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వర్షాలు సరిగా కురవక భూగర్భ జలమట్టాలు పడిపోతుండటంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు బోర్లు, బావులపైనే పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది. పంటలకు చివరి తడులు అందించేందుకు వ్యవసాయ మోటార్లను ఎక్కువ సమయం వినియోగిస్తుండగా.. మరోవైపు వేసవిని తలపించే ఎండలతో ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీలు, కూలర్ల వాడకం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ వినియోగ గణాంకాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గత నెల తగ్గినా..

నల్లగొండ విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలో జూలైలో 499 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదు కాగా.. ఆగస్టులో ఇది ఏకంగా 571.35 మిలియన్‌ యూనిట్లకు చేరింది. అంటే జూలైతో పోలిస్తే ఆగస్టులో 72.35 మిలియన్‌ యూనిట్ల వినియోగం అదనంగా పెరిగింది. సెప్టెంబర్‌లో 522.06 ఎంయూలకు తగ్గినప్పటికీ.. అక్టోబర్‌లో మళ్లీ డిమాండ్‌ పుంజుకుంటోంది. ఈ నెల కేవలం 13 రోజుల్లోనే 213.90 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది. ఇలానే కొనసాగితే నెలాఖరు నాటికి విద్యుత్‌ డిమాండ్‌ 600 మిలియన్‌ యూనిట్లకు పైగా చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వ్యవసాయంపై ప్రభావం

సరిపడా వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు మోటార్లతో నీటిని తోడక తప్పట్లేదు. ప్రస్తుతం పలు పంటలు కోత దశకు చేరుకుంటుండటంతో చివరి తడులు అందించడం అత్యంత కీలకంగా మారింది. వర్షాలు పడకపోతే భూగర్భ జలాల వినియోగం మరింత పెరిగి, అది నేరుగా విద్యుత్‌ డిమాండ్‌పై ప్రభావం చూపనుంది.

ఎండలతో ఉక్కపోత..

మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం జోరందుకుంది. వ్యవసాయంతో పాటు గృహ, వాణిజ్య రంగాల్లోనూ విద్యుత్‌ వినియోగం ఒక్కసారిగా పెరిగిపోవడం డిమాండ్‌ను మరింత పెంచుతోంది.

నెలాఖరుకు మరింత పెరిగే అవకాశం

జూలై నుంచి అక్టోబర్‌ 13వ తేదీ వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం మొత్తం 1,806.31 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది. నెలవారీ సగటు 451.58 మిలియన్‌ యూనిట్లుగా ఉంది. ఈనెల మరో 18 రోజులు మిగిలి ఉండటంతో నెలాఖరుకు విద్యుత్‌ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ నెలాఖరుకు విద్యుత్‌ డిమాండ్‌ ఎంత మేరకు చేరుతుందన్నది రోజువారీ వినియోగం, వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

ఫ ఓ వైపు భూగర్భ జలాల క్షీణత.. మరోవైపు ఉక్కపోతతో అల్లాడుతున్న జనం

ఫ పంటలను కాపాడుకునేందుకు విరివిగా మోటార్ల వినియోగం

ఫ ఇళ్లు, కార్యాలయాల్లో నిరంతరాయంగా నడుస్తున్న ఏసీలు, కూలర్లు

ఫ ఈనెలలో ఇప్పటికే 213.90 మిలియన్‌ యూనిట్లు నమోదు

ఫ నెలాఖరుకు 600 దాటే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement