నల్లగొండ: జిల్లాలో ఆధార్ సేవలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. అన్ని వయస్సుల వారి ఆధార్ నమోదు శాతాన్ని పెంచడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. 5 సంవత్సరాలు , 15 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న పిల్లలకు ఉచితంగా నిర్వహించే తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియపై విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అదనపు ఎస్పీ రమేష్, డీఈఓ సుశీందర్రావు, డీఐఈఓ దశ్రు నాయక్, డీఎంహెచ్ఓ రాహుల్, పోస్టల్ సూపరింటెండెంట్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్, ఈ– డిస్ట్రిక్ట్ మేనేజర్ దుర్గా రావు, ఆధార్ అసిస్టెంట్ మేనేజర్ శ్రవణ్, మీ సేవ ఏఓ రాజశేఖర్, మీ– సేవ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యం
నల్లగొండ టౌన్: కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా లెప్రసీ కేస్ డిటెన్షన్ క్యాంపెయిన్ (ఎల్సీడీసీ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్ తెలిపారు. మంగళవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్సీడీసీ కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి నవంబరు 4వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలున్న వ్యక్తులను గుర్తించి అనుమానిత కేసులకు అవసరమైన పరీక్షలు నిర్వహించాలన్నారు. కార్యక్రమం విజయవంతానికి అధికారులతో పాటు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర ఆరోగ్య సిబ్బంది సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, మెడికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
హోటళ్లలో తనిఖీలు
నార్కట్పల్లి : నార్కట్పల్లి మండల పరిధిలోని పలు హోటళ్లలో టీజీఎస్ఎఫ్ ఫుడ్ వింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ సేఫ్టీ అధికారుల బృందం మంగళవారం తనిఖీలు నిర్వహించింది. జాతీయ రహదారితో పాటు నార్కట్పల్లి–అద్దంకి రహదారి వెంట ఉన్న వివేరా, అమ్మచేతి వంట, అక్షయ్ పార్క్ హోటళ్లలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్రెడ్డి నేతృత్వంలో సోదాలు చేపట్టింది. హోటళ్ల స్టోర్ రూమ్లను, వంట గదులను, ఉపయోగిస్తున్న దినుసులు, ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసిన పిండి వంటకాలను గుర్తించిన అధికారులు, సుమారు 35 కేజీల కలుషిత పిండి పదార్థాలను పారబోయించారు.
చిట్యాల : మండల పరిధిలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని సెవెన్ ప్లాజా హోటల్లో పురుగులు పట్టిన పెసరపప్పును అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర విచారణ నిమిత్తం అధికారులు తగిన శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు తీసుకెళ్లారు.


