సాగర్‌ ఎడమకాల్వపై తూము లీకేజీ | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ ఎడమకాల్వపై తూము లీకేజీ

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

ప్రమాదమేమీ లేదు : సీఈ

నిడమనూరు : నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పరిధిలోని 31.1వ కిలోమీటరు వద్ద ఉన్న నర్సింహాలగూడెం మేజర్‌ తూము దెబ్బతిని భారీగా నీటి లీకేజీ ఏర్పడింది. మంగళవారం ఉదయం కాల్వ లస్కర్లు లీకేజీని గుర్తించి, ప్రవాహాన్ని అదుపు చేసేందుకు షట్టర్‌ను దిగువకు దించగా నీటి ఒత్తిడి మరింత పెరిగింది. తూము నుంచి దాదాపు 20 క్యూసెక్కులకు పైగా నీరు ఉధృతంగా నిడమనూరు చెరువులోకి వచ్చి చేరుతోంది. దీంతో చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగుపోస్తుండటంతో పాటు, మేజర్‌కు గండి పడిందంటూ వదంతులు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న నిడమనూరు తహసీల్దార్‌ జంగాల కృష్ణయ్య క్షేత్రస్థాయిలో చెరువును, బంకాపురం బ్రిడ్జిని పరిశీలించారు. నీటి ప్రవాహం అదుపులోనే ఉందని, ప్రజలెవరూ వదంతులు నమ్మవద్దని కోరారు.

ఫలించని శ్రమ

లీకేజీ సమాచారం తెలియగానే ఎన్నెస్పీ ఈఈ గోపినాథ్‌, డీఈలు స్వామి, జగన్నాథరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లస్కర్లు నీటిలోకి దిగి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఇసుక బస్తాలు, గడ్డి కట్టలు వేసినా ప్రవాహం తగ్గలేదు. టిప్పర్‌ ద్వారా నేరుగా మట్టిని తూములో పోసినప్పటికీ ఉధృతిని నియంత్రించలేకపోయారు. దీంతో ముందు జాగ్రత్తగా సాగర్‌ ఎడమకాల్వలో నీటి ప్రవాహాన్ని 6 వేల క్యూసెక్కుల నుంచి 5 వేల క్యూసెక్కులకు తగ్గించారు.

ఫ నర్సింహాలగూడెం తూము దెబ్బతిని ఉధృతంగా నీటి ప్రవాహం

ఫ వేగంగా నిండి అలుగుపోస్తున్న నిడమనూరు చెరువు

ఫ ఆందోళనలో గ్రామస్తులు.. గండి పడిందంటూ వదంతులు

ఘటనా స్థలాన్ని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. మేజర్‌ లీకేజీ వల్ల ప్రధాన కాల్వ కట్టకు ఎలాంటి ప్రమాదమూ లేదని స్పష్టం చేశారు. తూములోని అంతర్గత రాతి గోడలు దెబ్బతినడం వల్లే షట్టర్‌ వెంట లీకేజీ ఏర్పడిందన్నారు. ఇదిలా ఉండగా.. మేజర్‌ మూసివేతకు మంగళవారం సాయంత్రం వరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో నీటి లోపలికి వెళ్లి పరిస్థితిని పరిశీలించేందుకు విశాఖపట్నం నుంచి గత ఈతగాళ్లను రప్పిస్తున్నట్లు సీఈ తెలిపారు. మేజర్‌ను శాశ్వతంగా మూసివేసే చర్యలు వేగవంతం చేస్తామన్నారు. సీఈ వెంట ఈఈ మల్లికార్జున్‌, డీఈ గోపినాథ్‌, అధికారులు స్వామి, జగన్నాథ్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement