ఆన్‌లైన్‌ స్టాంప్‌ తిప్పలు | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ స్టాంప్‌ తిప్పలు

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

ఫిర్యాదులు వస్తే చర్యలు చేపడతాం

మీసేవలో సాంకేతిక సమస్యలు.. వెండర్ల వద్ద అదనపు వసూళ్లు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : స్టాంప్‌ పేపర్ల విక్రయాల్లో పారదర్శకత తీసుకురావడం, అక్రమాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ విధానం ప్రజలకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతోంది. మీసేవ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడం, సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరంగా స్టాంప్‌ పేపర్‌ కావాల్సిన వారు ఏం చేయాలో తెలియక రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే అదనుగా అక్కడి దళారులు వారిని స్టాంప్‌ వెండర్ల వద్దకు పంపుతుండటంతో అదనపు మొత్తాన్ని చెల్లించి కొనాల్సి వస్తోంది.

మీసేవలో సమస్య, వెండర్ల వద్ద సులువుగా..

ఉమ్మడి జిల్లాలో 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో అధికారిక స్టాంప్‌ వెండర్లు 250 మందికిపైగా ఉన్నారు. అందులో నల్లగొండలో 30 మందికి పైగా ఉండగా, యాదగిరిగుట్ట, సూర్యాపేట ప్రాంతాల్లో అదేస్థాయిలో ఉన్నారు. అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో నిత్యం 500 వరకు స్టాంప్‌ పేపర్లు విక్రయిస్తారు. ఇందుకోసం టీ యాప్‌ ఫోలియో యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే మీ సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఆ వివరాల ఆధారంగా వెండర్‌ స్టాంప్‌ పేపరు ఇస్తారు.

రేటు పెంచి విక్రయాలు..

ఆన్‌లైన్‌ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను కొందరు తమకు అనుకూలంగా మలుచుకుని ఎక్కువ రేట్లకు స్టాంప్‌ పేపర్లు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్టాంప్‌ వెండర్స్‌ నేరుగా రిజిస్ట్రేషన్ల శాఖ లాగిన్‌ అవుతారు కాబట్టి వారికి సులభంగా సైట్‌ ఓపెన్‌ అవుతోంది. స్టాంప్‌ పేపర్‌ విక్రయిస్తే వారికి ప్రభుత్వమే 5 శాతం కమీషన్‌ ఇస్తుంది. అధికారికంగా నిర్ణయించిన ధరకు స్టాంప్‌ పేపర్‌ విక్రయించాలి. కానీ దానికి అదనంగా రూ.100 స్టాంప్‌ పేపరును రూ. 150 నుంచి రూ.175 వరకు విక్రస్తున్నారుని, దానికి తోడు వివరాల నమోదుకు కూడా అదనంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పట్టించుకోని అధికారులు

స్టాంప్‌ పేపరు కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో మీసేవ కేంద్రంలో వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడానికి కారణమేంటి? సాధారణ దరఖాస్తుదారులకు ఎదురవుతున్న సమస్యలు వెండర్ల వద్ద ఎందుకు తలెత్తడం లేదు? సాంకేతిక సమస్యలా.. లేక విధానంలోని లోపాలా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యత్యాసంపై సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

స్టాంప్‌ వెండర్స్‌ అదనంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై ఫిర్యాదులు వస్తే చర్యలు చేపడతాం. ఏటా స్టాంప్‌ వెండర్లకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా స్టాంప్‌ వెండర్‌ అదనంగా వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే వారిపై ఐజీ కార్యాలయానికి నివేదిక పంపుతాం. దాని ప్రకారం చర్యలు చేపడతాం. వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు వస్తే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.

– మౌనికారాణి, జిల్లా రిజిస్ట్రార్‌

ఫ స్టాంప్‌ పేపర్ల కోసం సామాన్యులకు తప్పనిపాట్లు

ఫ మీసేవలో ఓపెన్‌ కాని రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌

ఫ ఇదే అదునుగా దోపిడీ చేస్తున్న స్టాంప్‌ వెండర్లు

ఫ స్టాంప్‌ పేపర్ల విక్రయాల్లో పారదర్శకతకు పాతర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement