కరెంట్‌ కష్టాలు.. జనరేటర్లతో తిప్పలు | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కష్టాలు.. జనరేటర్లతో తిప్పలు

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

వ్యవసాయం భారంగా మారుతోంది

వేములపల్లి : వ్యవసాయానికి కీలకమైన దశలో విద్యుత్‌ కోతలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరెంట్‌ సరఫరా సక్రమంగా లేక అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు నీరందించేందుకు ఒకవైపు విద్యుత్‌ కోసం ఎదురుచూస్తూనే, మరోవైపు జనరేటర్ల సాయంతో నీరు పారిస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువుల ధరలతో పెట్టుబడి భారం మోస్తున్న రైతులకు, కరెంట్‌ కోతలు అదనపు సమస్యగా మారాయి. సాగు ఖర్చులు పెరిగి, దిగుబడి రాకపోతే నష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు.

జనరేటర్లతో అదనపు భారం..

వ్యవసాయ బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు కరెంట్‌ కోతలు తీవ్ర ఇబ్బందిగా మారాయి. సరఫరా నిలిచిపోతే పంటలు ఎండిపోతాయన్న భయంతో ట్రాక్టర్లకు జనరేటర్లు అమర్చి మోటార్లు నడుపుతున్నారు. దీనివల్ల డీజిల్‌, ట్రాక్టర్‌ అద్దె తదితర ఖర్చులతో వ్యవసాయం తలకు మించిన భారంగా మారుతోందని రైతులు వాపోతున్నారు.

నిద్రాహారాలు మాని.. పొలాల వద్దే పడిగాపులు

పగటి పూట కరెంట్‌ లేకపోతే రాత్రివేళల్లో పొలాలకు వెళ్లాల్సి వస్తోంది. కరెంట్‌ ఎప్పుడొస్తుందో తెలియక రాత్రంతా పొలాల వద్దే జాగారం చేస్తున్నారు. విద్యుత్‌ సరఫరాపై స్పష్టత లేకపోవడంతో నీటి తడుల ప్రణాళిక దెబ్బతింటోందని పేర్కొంటున్నారు. సకాలంలో సాగునీరు అందకపోతే పంటల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందనే భయం వారిలో నెలకొంది. పెట్టుబడి పెరిగినంత మాత్రాన దిగుబడి పెరుగుతుందనే నమ్మకం లేదని, ఒకవేళ దిగుబడి తగ్గితే అప్పుల పాలవడం ఖాయమని చెబుతున్నారు. అధికారులు స్పందించి విద్యుత్‌ కోతల సమస్యను పరిష్కరించాలని, వ్యవసాయ బోర్లకు నిరంతరాయంగా కరెంట్‌ సరఫరా చేయాలని వేములపల్లి రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

వ్యవసాయం చేయడం రోజు రోజుకూ భారంగా మారుతోంది. విత్తనాలు, ఎరువులు, మందుల కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశాం. నీరు పెట్టాల్సిన సమయంలో కరెంట్‌ లేకపోతే జనరేటర్‌తో మోటారు నడపాల్సి వస్తోంది. దీంతో ట్రాక్టర్‌, డీజిల్‌ ఖర్చులు అదనంగా పడుతున్నాయి. కరెంట్‌ ఎప్పుడొస్తుందో తెలియక రాత్రంతా పొలాల వద్దే ఉంటున్నాం. అధికారులు స్పందించి సక్రమంగా కరెంట్‌ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలి.

– ఉగ్గిడి సతీష్‌, రైతు, మొల్కపట్నం

ఫ విద్యుత్‌ కోతలతో రైతుల అవస్థలు

ఫ సాగు కోసం రాత్రింబవళ్లు పొలాల వద్దే పడిగాపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement