నల్లగొండ టౌన్ : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో నూతన నాయకత్వం కొలువుదీరింది. ఆదివారం నిర్వహణ కమిటీ సభ్యుల ఎన్నికలు పూర్తికాగా.. సోమవారం కీలక పదవులకు ఎన్నిక నిర్వహించారు. సొసైటీ చైర్‌పర్సన్‌గా డాక్టర్ హేమలత, వైస్ చైర్మన్‌గా భీమనపల్లి శ్రీకాంత్, ట్రెజరర్‌గా కుంభం జ్యోతిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా మంచుకొండ చిన్న భిక్షమయ్య ఎంపికయ్యారు. నల్లగొండ రెడ్‌క్రాస్ సొసైటీకి తొలి మహిళా చైర్‌పర్సన్‌గా హేమలత బాధ్యతలు చేపట్టనున్నారు.
రెండు ప్యానళ్ల మధ్య హోరాహోరీ పోటీ..
రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహణ కమిటీ సుమారు 12 ఏళ్లుగా ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఈసారి ఎన్నికల్లో డాక్టర్ హేమలత ఆధ్వర్యంలోని నల్లగొండ సేవా సమితి ప్యానెల్, గోలి అమరేందర్‌రెడ్డి ప్యానెల్ పోటీ పడ్డాయి. 32 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆదివారం నిర్వహించిన పోలింగ్‌లో 1,003 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అర్ధరాత్రి వరకు చేపట్టిన ఓట్ల లెక్కింపులో 15 మంది నిర్వహణ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఫలితాల్లో డాక్టర్ హేమలత ఆధ్వర్యంలో సేవా సమితి ప్యానెల్‌కు 8 స్థానాలు దక్కగా, గోలి అమరేందర్‌రెడ్డి ప్యానెల్‌కు 7 స్థానాలు లభించాయి. దీంతో రెండు ప్యానళ్ల మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. ఒక్కో విడత ఓట్ల లెక్కింపు వెలువడుతున్న కొద్దీ అభ్యర్థులు, వారి మద్దతుదారుల్లో ఉత్కంఠ నెలకొంది.
సేవల విస్తరణపై ఆశలు..
రెడ్‌క్రాస్ సొసైటీకి కొత్త కార్యవర్గం ఏర్పాటుతో సేవా కార్యక్రమాలు మరింత విస్తరిస్తాయనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. రక్తదాన శిబిరాల నిర్వహణ, రక్తనిధి సేవలు, పేదలకు వైద్య సహాయం, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలను బలోపేతం చేయాల్సిన బాధ్యత కొత్త కమిటీపై ఉంది. రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, జిల్లా సహకార అధికారి మమత తెలిపారు.
ఫ కొలువుదీరిన సొసైటీ నిర్వహణ కమిటీ
ఫ ఉత్కంఠగా సాగిన ఎన్నికలు


