నల్లగొండ, (కనగల్) : ఎల్‌నినో పరిస్థితుల్లో తాగునీరు అత్యంత ముఖ్యమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రజలు, రైతులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో కనగల్ మండలం పగిడిమర్రి రైతు వేదిక నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌నినో అనేది ఒక విపత్తు అన్నారు. పంటల సాగులో నష్టాలను తగ్గించి రైతుల ప్రయోజనాలను కాపాడాలని, శాస్త్రవేత్తల సూచనల ప్రకారం ముందుకెళ్లాలని తెలిపారు. విత్తనాల లభ్యత, ఉద్యాన పంటల సాగు, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలపై శాస్త్రవేత్తలను, వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువుల్లో అందుబాటులో ఉన్న నీటిని సాగుకు కాకుండా తాగుకు వినియోగించాలని సూచించారు. అవసరమైతే రెండేళ్లకు సరిపడా నీరు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ప్రతి ఇంటికి కిచెన్ గార్డెన్ కిట్లను అందజేయాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా కన్వీనర్ గోలి జగాల్‌రెడ్డి కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్, హార్టికల్చర్ అధికారి శేఖర్, పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసులు, మిషన్ భగీరథ ఈఈ శాంతకుమారి, తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ అవ వేదరక్షిత, ఏఓ బెజవాడ అమరేందర్‌గౌడ్, సర్పంచ్‌లు నాగమణి సైదులు, వేమిరెడ్డి భూపాల్‌రెడ్డి, ఓర్సు పెంటయ్య, కదిరె సైదులు, బక్క ఎల్లమ్మ ఏఈఓ కీర్తన, గోలి నర్సిరెడ్డి, అనిత, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


