‘ఖాకీ’వనంలో కలుపు మొక్కలు! | - | Sakshi
Sakshi News home page

‘ఖాకీ’వనంలో కలుపు మొక్కలు!

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

యాదాద్రిలో ఫిర్యాదుల పర్వం

రికవరీల్లో గోల్‌మాల్‌.. సెటిల్మెంట్లలో ఏకపక్షం

ఫ నార్కట్‌పల్లి బంగారం రికవరీ

కేసుతో పలువురు పోలీసుల

అక్రమాలు వెలుగులోకి..

ఫ కానిస్టేబుళ్లే కాదు.. ఎస్‌ఐలు,

సీఐలు, డీఎస్పీలకూ అవినీతి మరక

ఫ ఏసీబీ కేసులు నమోదైనా..

అటాచ్‌ చేసినా మారని వైఖరి

ఫ ఉమ్మడి జిల్లాలో దారి తప్పుతున్న

కొందరు పోలీసులు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నార్కట్‌పల్లి బంగారం రికవరీలో పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రికవరీ చేసిన బంగారానికి, చూపించిన దానికి మధ్య దాదాపు 18 తులాల వ్యత్యాసం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులపై ఉన్న అవినీతి అక్రమాల చర్చ తెరపైకి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లోనూ పోలీసుల వ్యవహారశైలిపై గతంలో వచ్చిన పలు ఫిర్యాదులు, ఆరోపణలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. లంచం డిమాండ్‌, విధుల్లో నిర్లక్ష్యం, భూ వివాదాల్లో ఏకపక్ష వైఖరి ఇలా వివిధ అంశాలు పోలీసు శాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

నల్లగొండలో ఏకపక్షంగా వ్యవహార శైలి

నిడమనూరు మండలం వెనిగండ్లలో భూమిని ఆక్రమించిన వారికి అండగా ఉంటూ, బాధితులైన ఎస్సీలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై బాధితులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.

2025లో గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో నిడమనూరు మండలంలోని సోమోరిగూడెంలో జరిగిన ఘర్షణ సందర్భంగా ఒక వర్గం నాయకులతో పాటు ముగ్గురు బాలింతలు సహా మొత్తం 38 మందిపై కేసు నమోదు చేయడం వివాదంగా మారింది.

గతంలో చండూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ వెంకన్న తాస్కానిగూడేనికి చెందిన అన్నదమ్ముల మధ్య భూ తగాదాలో తమ్ముడిని స్టేషన్‌కి పిలిచి కొట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

చండూరు మున్సిపల్‌ ఎన్నికల తరువాత రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో ప్రస్తుత ఎస్‌ఐ శివకుమార్‌ ఏకపక్షంగా వ్యవహరించి కేసులు నమోదు చేశారు. అందులో బెయిల్‌పై వచ్చిన ఒక వ్యక్తిని మళ్లీ స్టేషన్‌కు రమ్మంటూ బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీస్‌స్టేషన్‌ ముందు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

నాంపల్లిలో గతంలో ఎస్‌ఐగా పనిచేసిన శోభన్‌బాబు అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యుడితో బహిరంగంగానే భూవివాదంలో గొడవ పడ్డారు.

నాంపలికి చెందిన యువకుడి వ్యక్తిగత పంచాయితీలో అనుకూలంగా వ్యవహరించడం, ఓ పాపను విక్రయానికి పెట్టిన వారిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడంతో ఎస్‌ఐని ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

సూర్యాపేటలో కానిస్టేబుళ్ల నుంచి

ఉన్నతాధికారుల వరకు..

2025 జనవరిలో తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ఉక్కుర్తి సురేశ్‌, కానిస్టేబుల్‌ నాగరాజు లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కేసులో రూ.3 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు రాగా, రూ.1.40 లక్షలు ఫోన్‌పే, ఇతర మార్గాల్లో తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది.

2025 మేలో సూర్యాపేట డీఎస్పీ కె.పార్థసారథి, పట్టణ సీఐ పి.వీరరాఘవులు లంచం డిమాండ్‌ చేశారనే విషయంలో ఏసీబీ ఆరెస్టు చేసింది.

2024 డిసెంబర్‌లో మఠంపల్లి ఎస్‌ఐ రామాంజనేయులుపై ఓ మహిళను వేధించారనే ఆరోపణలతో పాటు, ఎన్నారైకి చెందిన కారును తీసుకొని తిరిగి ఇవ్వకుండా బెదిరించారనే ఫిర్యాదులు రావడంతో అతన్ని సస్పెండ్‌ చేశారు.

2025 మార్చిలో నూతనకల్‌ మండలం మిర్యాల కు చెందిన ఓ హత్య కేసులో కుటుంబ సభ్యులు ముందుగానే ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో డీఎస్పీ జి.రవికుమార్‌పై బదిలీ వేటు పడగా.. తుంగతుర్తి సీఐ శ్రీను నాయక్‌ను ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేసి, ఎస్‌ఐ మహేంద్రనాథ్‌కు చార్జిమెమో ఇచ్చారు.

2025 నవంబర్‌లో కోదాడకు చెందిన కర్ల రాజేశ్‌ మృతి వ్యవహారంలో పోలీసుల అదుపులో అక్రమ నిర్బంధం, చిత్రహింసలకు గురిచేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసులో కోదాడ రూరల్‌ సీఐ ప్రతాప్‌ లింగంను సస్పెండ్‌ చేసి, చిలుకూరు ఎస్‌ఐ సురేశ్‌రెడ్డిని ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

2025లో అర్వపల్లి ఎస్‌ఐ ఈట సైదులుపై విధుల్లో నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో లోపాలు, ఫిర్యాదుల స్వీకరణలో అలసత్వం వంటి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్‌ చేశారు.

ఫ యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో వినాయక శోభాయాత్ర సందర్భంగా డీజేలో కేసీఆర్‌ పాట పెట్టుకున్నప్పుడు పోలీసులు పాటను ఆపి డీజే పరికరాలను తీసుకెళ్లారని, గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆరోపించారు. మరుసటి రోజు ఆ యువకులను స్టేషన్‌న్‌కు పిలిపించి గుంజీలు తీయించడంతోపాటు సీఐ తమపై చేయి చేసుకున్నారని పూలేపాక మహేశ్‌ ెఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఫ యాదగిరిగుట్ట పట్టణంలో లాడ్జి నిర్వాహకులను బెదిరించారనే ఆరోపణలతో గతంలో సీఐపై డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఫ యాదగిరిగుట్ట మండలంలోని ఓ ప్రముఖ పరిశ్రమ నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారనే ఆరోపణలతో ఏసీపీపై కూడా పలువురు డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఫ ఆత్మకూరు(ఎం) మండలం సిద్దాపురంలోనూ భూ హద్దులు, బాట పంచాయితీ వివాదానికి సంబంధించి ఏనుగు గౌతంరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. అయితే తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతోపాటు తనపైనే కేసు నమోదు చేశారని గౌతంరెడ్డి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement