ఇథనాల్‌పై సమగ్ర అధ్యయనం అవసరం | - | Sakshi
Sakshi News home page

ఇథనాల్‌పై సమగ్ర అధ్యయనం అవసరం

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

మిర్యాలగూడ : పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపి వినియోగించే విధానంపై కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లే ఆహార భద్రత వ్యవస్థలో ప్రతిష్టంభన ఏర్పడిందని, ఈ విధానంపై వెంటనే పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. ఆదివారం మిర్యాలగూడలో ఏఐకేఎస్‌ ఆధ్వర్యంలో ‘భారతదేశంలో ఆహార భద్రతపై ఇథనాల్‌ విధాన ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ఇథనాల్‌ వినియోగం ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం వంటి లక్ష్యాలు ఉన్నప్పటికీ రైతులకు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌కు, ఆహార భద్రతకు కలిగే నష్టాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. చెరుకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడం వల్ల సదరు పంటలకు డిమాండ్‌ పెరిగి రైతులకు అదనపు మార్కెట్‌ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇథనాల్‌ విధానం వల్ల వచ్చే ప్రయోజనాలు రైతులకు ఎంతవరకు చేరుతున్నాయి, పంటల సాగు విస్తీర్ణంలో మార్పులు వస్తే ధాన్యాల ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇథనాల్‌ విధానంపై స్వతంత్ర నిపుణుల కమిటీతో సమగ్ర అధ్యయనం చేయించి రైతు సంఘాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు, వినియోగదారుల అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. రైతు సంఘం జాతీయ నాయకుడు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌ మాట్లాడుతూ ఇంధన అవసరాల కోసం వ్యవసాయాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ వ్యవసాయాన్ని కేవలం ఇంధన ముడిపదార్థాల సరఫరా రంగంగా మార్చవద్దని హితవు పలికారు. నవంబర్‌ 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో జాతీయ రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, ఆదర్శ రైతు జొన్నలగడ్డ మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఫ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement