కొండమల్లేపల్లి : ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై వాస్తవాలను వక్రీకరించేలా సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేయొద్దని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 30 టీఎంసీల నీటిని తరలించి సుమారు 3లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును చేపట్టిన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో టన్నెల్–1, టన్నెల్–2కు పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్‌ఎల్‌బీసీ పనులను పూర్తి చేసేందుకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రాజెక్టు చరిత్ర తెలుసుకోకుండా కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల హయాంలో ఈ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో ప్రజలకు వివరించాలన్నారు. శ్రీశైలం నుంచి లిఫ్ట్ ద్వారా నీటిని తరలించే విషయంలో మహబూబ్‌నగర్‌కు 1.5టీఎంసీలు, నల్లగొండకు 0.5టీఎంసీలను కేటాయించడం అన్యాయమన్నారు. డిండి ప్రాజెక్టును కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నింపి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ నిండేవరకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించకుండా నియంత్రించాలన్నారు. సమావేశంలో దస్రూనాయక్, సర్పంచ్‌లు తులసీరాంనాయక్, కావటి వెంకటేష్, దీప్‌లాల్, మాజీ సర్పంచ్ గుండెబోయిన లింగంయాదవ్, రావుల వెంకటయ్య, రమావత్ శ్రీను, రావుల సత్యనారాయణ, బోడ యాదగిరి, హరికృష్ణ, తోటపల్లి వెంకటేష్ తదితరులున్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్


