మిర్యాలగూడ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెం గ్రామంలోని సర్వే నంబర్ 214లో గల ప్రభుత్వ భూమిని మంగళవారం ఆయన సందర్శించారు. స్థలానికి సంబంధించిన లేఅవుట్లు, భూ రికార్డులు, మ్యాప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తోందని.. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని తెలిపారు. ఒకే ప్రాంగణంలో 2,500 మంది విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో ఉచితంగా నాణ్యమైన విద్యనందించేలా ఈ పాఠశాలల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. భూ సమీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మైనింగ్ ఏడీ రవికుమార్, ఆర్‌ఐ రామకృష్ణ, కృష్ణయ్య, డిప్యూటీ సర్వేయర్ శ్రీనివాస్‌రెడ్డి, సర్వేయర్లు శ్రీనివాస్, సైదులు, నరసింహ సిబ్బంది ఉన్నారు.


