నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా జైలులో ఓ ఖైదీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సోమవారం సాయంత్రం జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బాబురావు పురుగుల మందు తాగి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. గుర్తించిన తోటి ఖైదీలు జైలు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అతడిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్టమక్ వాష్ నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.
జైలర్ తిట్టడంతోనే తాగానన్న ఖైదీ..
బాబురావు మోత్కూరులో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులోకి తంబాకు వచ్చిన ఘటనకు తానే కారణమంటూ జైలర్ అచ్చయ్య తనను తిట్టడంతో మానసిక వేదనకు గురయ్యానని బాబురావు మీడియాకు తెలిపాడు. ఈ కారణంగానే జైలు సూపరింటెండెంట్ బీరువాలో ఉన్న పురుగుల మందును తీసుకుని తాగినట్లు బాబురావు తెలిపాడు. జైలులో కూరగాయలు, ఇతర మొక్కల పెంపకం కోసం పురుగుల మందులను తీసుకొచ్చి భద్రపరిచినట్లు తెలుస్తోంది. అయితే ఖైదీకి ఆ మందు ఎలా అందుబాటులోకి వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం బాబు రావుకు నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
అధికారుల వివరణ మరోలా..
బాబురావు ఆత్మహత్యాయత్న విషయాన్ని జైలు అధికారులు మాత్రం ఖండిస్తున్నారు. రెండు రోజులుగా బాబురావు అనారోగ్యంతో ఉన్నాడని, సోమవారం కిందపడిపోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని జైలర్ బాలకృష్ణ తెలపడం గమనార్హం.
పురుగుల మందు తాగిన
ఖైదీ బాబురావు
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స
జైలర్ అచ్చయ్య తిట్టడంతోనే మనస్థాపానికి గురయ్యానన్న ఖైదీ
ఆత్మహత్యాయత్నం చేసుకోలేదు
అంటున్న జైలు అధికారులు


