పత్తిచేలు ఆశాజనకంగా ఉన్నాయి
నల్లగొండ అగ్రికల్చర్ : ఈ వానాకాలం సీజన్‌లో వరి సాగు గణనీయంగా పడిపోగా, పత్తి పంట మాత్రం కొంత ఊరటనిచ్చే స్థాయిలో ముందుకు సాగుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. జూన్‌లో కురిసిన చినుకులతో రైతులు ఉత్సాహంగా పత్తి విత్తనాలు విత్తుకున్నారు. ఇటీవల కురిసిన చిరుజల్లులకు పత్తి చేలు ఏపుగా పెరుగుతున్నాయి. అయితే, జూలై నెల మొత్తం తీవ్ర లోటు వర్షపాతం నమోదు కావడంతో వరి నాట్లు ముందుకు సాగలేదు. భూగర్భజలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు తగ్గడం, నాగార్జునసాగర్, ఎలిమినేటి మాధవరెడ్డి (ఏఎమ్మార్పీ) ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదల లేకపోవడం వరి సాగును దెబ్బతీసింది.
వరి సాగు డీలా.. పత్తికే మొగ్గు!
వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ సీజన్‌లో మొత్తం 12 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉంది. ఇందులో వరి 5,46,165, పత్తి 6,47,689 ఎకరాల్లో సాగవుతుందని భావించారు. కానీ ఎల్‌నినో ప్రభావం, ఎండల వల్ల పరిస్థితి మారింది. ఇటీవల కురిసిన అడపాదడపా చిరుజల్లులతో ప్రస్తుతం 3,15,182 ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. నీటి ఎద్దడిని తట్టుకునే పత్తి పంటను రైతులు ఎక్కువగా ఆశ్రయించారు. ప్రస్తుతం జిల్లాలో పత్తి సాగు 5,97,677 ఎకరాలకు చేరుకుని అంచనాలకు దగ్గర్లో నిలిచింది. కంది, పెసర, మినుము పంటలతో కలిపి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 9,27,855 ఎకరాల్లో సాగు నమోదైంది.
జిల్లా అంతటా వేసిన పత్తి చేలు ఇటీవల కురిసిన చిరుజల్లులకు మంచిగా పెరుగుతున్నాయి. నెలలో రెండుమూడు వర్షాలు కరిస్తే పత్తికి డోకా ఉండదు. రైతులకు అశించిన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నీటి లభ్యత లేని రైతులు అరుతడి పంటలు సాగు చేసుకోవడం మేలు.
ఉల్లోజు వినోద్‌కుమార్,
జిల్లా వ్యవసాయ అధికారి
ఫ వర్షాభావంతో తలకిందులైన వానాకాలం సాగు అంచనాలు
ఫ ఎండిపోతున్న బోర్లు..
ప్రాజెక్టుల నుంచి రాని సాగునీరు
ఫ పత్తికి ప్రాణం పోసిన చిరుజల్లులు


