నీలగిరి కార్పొరేషన్‌లో సేవలు ఇక సులభతరం
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో క్యాష్‌లెస్.. పేపర్ లెస్ విధానం అమలు చేసేందుకు కార్పొరేషన్ కమిషనర్ వంశీకృష్ణ శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు తదితర వాటిని పూర్తిగా ఆన్‌లైన్ చేయడం ద్వారా నగదు రహిత సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఏ ఒక్క సెక్షన్‌లో కూడా నగదు రూపంలో డబ్బులు తీసుకోకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించడంతో పూర్తిస్థాయిలో డిజిటల్ లావాదేవీలు అమలు చేస్తున్నారు.
సీఎస్సీతో పెరగనున్న జవాబుదారీతనం..
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇక నుంచి ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నెలల తరబడి అధికారుల కోసం తిరగకుండా సిటిజన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) తీసుకువచ్చారు. దీనిని అమలు చేయడం ద్వారా అధికారులు, సిబ్బందిలో జవాబు దారీతనం పెరగనుంది. నగర ప్రజలు భవన అనుమతులు, వీధి దీపాలు, రోడ్లు, మురుగు కాల్వలు, తాగునీటి సమస్య తదితర వాటికి సంబంధించి ఇప్పటివరకు నేరుకు ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పలు విభాగాల్లో దరఖాస్తులు ఇస్తూ వచ్చారు. ఇక నుంచి సిటిజన్ సర్వీస్ సెంటర్‌లో ఫిర్యాదు ఇస్తే.. అక్కడ వెంటనే ఆన్‌లైన్ చేసి సంబంధిత విభాగాల వారికి పంపాల్సి ఉంటుంది. ఆ సమస్యను సంబంధిత సెక్షన్ అధికారి పరిష్కరించి సీఎస్సీ లాగిన్‌కు పంపుతారు. దీనిని సీఎస్సీ నిర్వాహకుడు ఫిర్యాదుదారుడి సెల్‌కు మెసేజ్ వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కార్యాలయంలోని అన్ని విభాగాలు తిరగకుండా జనం ఒక్కచోట ఫిర్యాదు చేస్తే చాలు సమస్యకు పరిష్కారం చూపుతారు. అదే విధంగా ఆ సమస్య పరిష్కారం చేయలేకపోతే ఎందుకు చేయలేమో వివరంగా ఫిర్యాదుదారుడికి రాత పూర్వకంగా తెలియజేస్తారు. ఇక నుంచి పూర్తిస్థాయిలో క్యాష్ లెస్.. పేపర్ లెస్ విధానం అమలు చేయడం ద్వారా నగర ప్రజలకు పారదర్శకమైన సేవలు అందనున్నాయి.
చిల్లర సమస్యకు చెక్
నగదు రూపంలో పన్నులు వసూలు చేయడం ద్వారా కొన్ని సార్లు మున్సిపల్ సిబ్బందికి సైతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎక్కువ మంది వచ్చినప్పుడు నోట్లను సరిగా లెక్కించకపోవడం, ఒక్కోసారి తక్కువ డబ్బు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో సిబ్బంది జేబులోంచి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నుంచి ఇలాంటి వాటికి చెక్ పడనుంది. చిల్లర సమస్యకు సైతం ఇబ్బంది లేకుండా పోతుంది.
ఫ నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం
ఫ ప్రతీ ఫిర్యాదు ఆన్‌లైన్


