నేను పని చేస్తున్న నకిరేకల్ మండలం పాలెంలో నాకు మూడు బ్లాక్‌లు కేటాయించారు. నా మూడు బ్లాక్‌లు మూడు దిక్కులుగా ఉన్నాయి. అతి కష్టం మీద మూడు బ్లాక్‌ల మ్యాపింగ్ చేయాల్సి వచ్చింది. ఇది అయిపోకా యాప్‌లో నమోదు చేద్దామంటే గ్రామాల్లో ఉపాధి హామీ పని అడ్డంకిగా మారింది. ప్రజలందరు ఉదయం 6.30గంటలకే పనులకు వెలుతున్నారు. మళ్లీ 12 గంటల తర్వాత ఇంటికి వస్తున్నారు. వారి కోసం మధ్యాహ్నం వరకు నిరీక్షించాల్సి వస్తోంది.
– నర్సింహమూర్తి, పాలెం, నకిరేకల్ మండలం
ఒక్కో ఎన్యుమరేటర్‌కు 180 నుంచి 320 వరకు గృహాలను కేటాయించారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా ఇళ్లను విభజించడం వల్ల కొందరు ఎన్యుమరేటర్లకు తక్కువ ఇళ్లు, మరి కొందరికి ఎక్కువ ఇళ్లు కేటాయించబడ్డాయి. కొందరికి మూడు, నాలుగు బ్లాక్‌లు కూడా కేటాయించారు. అవి వేర్వేరు ప్రాంతాల్లో ఉండడంతో ఎండలకు ఆయా ప్రాంతాలకు వెళ్లి మ్యాపింగ్ చేయాల్సి వస్తోంది. కొన్ని ఇళ్లకు నంబర్లు లేకపోవడంతో వాటిని మ్యాపింగ్ చేయడం వారికి కష్టతరంగా మారింది. మ్యాపింగ్ పూర్తి చేసినా గ్రామాల్లో ప్రజలు పనులకు వెళ్తుండడంతో వారి వివరాలు నమోదు చేసేందుకు మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి వస్తోంది. పంచాయతీ సిబ్బంది కూడా వీరికి ఎలాంటి సహకారం అందించడం లేదు.
నకిరేకల్ : జనగణన ప్రక్రియలో క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటిసారిగా డిజటల్ జనగణన చేపడుతున్నారు. మొదటి దశ జనగణన ప్రక్రియ ఈనెల 11 నుంచి జూన్ 9 వరకు కొనసాగుతుంది. మొదటి దశలో ఆయా ప్రాంతాలకు కేటాయించిన ఎన్యుమరేటర్లు ఇంటి వివరాలు, గృహ సౌకర్యాలు, తాగు నీరు, ఆస్తుల వివరాలు, నివాస పరిస్థితుల వంటి సమాచారం సేకరిస్తారు. అయితే సర్వే చేసే ఎన్యుమరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు జనగణన, మరోవైపు బడిబాట ఒత్తిడిలో ఉపాధ్యాయులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
క్లిష్టంగా మ్యాపింగ్ ప్రక్రియ
జనాభా, గృహాలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్లు, పర్యవేక్షకులు కీలకపాత్ర పోషిస్తున్నారు. మొదటి మూడు రోజుల్లో గృహాల మ్యాపింగ్ పూర్తి చేసి ఇంటి నంబర్లు వేయాలని సూచించారు. ఆ ప్రక్రియ అనేక గ్రామాల్లో పూర్తి కాకపోవడంతో ఎన్యుమరేటర్లు, ఆందోళకు గురిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహాల సంఖ్య ఎక్కువగా ఉండడం, మ్యాపింగ్ ప్రక్రియ క్లిష్టంగా మారింది. కేవలం మూడు రోజుల్లో పనిపూర్తి చేయాలని అధికారులు ఆదేశించడంతో వారు ఒత్తిడి లోనవుతున్నారు. అందరికీ సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు విద్యశాఖ ఈనెల 14 నుంచి బడిబాట నిర్వహించాలని ఆదేశించింది. దీంతో వారు పనిచేస్తున్న పాఠశాలలకు ఉరుకులు పరుగులు పెట్టి మళ్లీ జనగణన ప్రక్రియలో పాల్గొంటున్నారు. దీనికి తోడు తీవ్ర ఎండలు వారిని భయపెడుతున్నాయి.
ఉత్తర్వులు కంటితుడుపే..
ప్రభుత్వం జనగణన డ్యూటీ పడని ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. అయితే జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే 95 శాతం మంది ఉపాధ్యాయులకు జనగణన డ్యూటీ పడింది. వారు బడిబాట కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు జనగణన డ్యూటీ చేయాల్సి రావడం ఇబ్బందిగా మారింది.
ఫ క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్న ఎన్యుమరేటర్లు
ఫ బ్లాక్‌ల కేటాయింపులో వ్యత్యాసం
ఫ కష్టతరంగా మారిన మ్యాపింగ్ ప్రక్రియ
ఫ గ్రామాల్లో ఉపాధి పనులతో మధ్యాహ్నం ఎండలోనే డ్యూటీ
ఫ బడిబాట, జనగణనతో ఉపాధ్యాయుల ఉరుకులు పరుగులు


