హెలికాప్టర్‌ మంత్రులు ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

హెలికాప్టర్‌ మంత్రులు ఎక్కడ?

May 19 2026 1:52 AM | Updated on May 19 2026 1:52 AM

నల్లగొండ : రైతులు అరిగోస తీస్తుంటే హెలికాప్టర్‌ మంత్రులు ఎక్కడికి పోయారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న నిర్లక్ష్యంపై బీఆర్‌ఎస్‌ నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో క్వింటాకు 10 కేజీల చొప్పున కోత విధించి రైతులను ఇబ్బంది పెడుతున్నా.. జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పత్తాలేరని మండిపడ్డారు. ఆనాడు కేసీఆర్‌ ఉచిత విద్యుత్‌, రైతుబంధు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు రారాజులా ఉన్నారని చెప్పారు. ఇప్పటి ప్రభుత్వానికి ముందుచూపు లేక రైతులను ఆగం చేసిందన్నారు. కరోనా సమయంలోనూ దేశమంతా ఇంటికే పరిమితమైతే తెలంగాణలో మాత్రం రైతు కల్లాల వద్దకు వెళ్లి ధాన్యం కొన్న చరిత్ర కేసీఆర్‌కు దక్కిందన్నారు. ప్రజలు రేవంత్‌రెడ్డి మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే మోసం చేశాడని.. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లను పట్టించుకోని కాంగ్రెస్‌ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు.

మంత్రులు ఏసీ రూమ్‌లకే

పరిమితమయ్యారు : ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఏసీ రూమ్‌లకే పరిమితమయ్యారని, రైతులను పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. 60 నుంచి 70 కార్ల కాన్వాయ్‌తో వెళ్లి కల్లాల వద్ద డ్రామాలు చేశారు తప్ప రైతుల గోస పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతులను పట్టించుకోలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్పాలన్నారు. ధర్నాలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, కిషోర్‌కుమార్‌, ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు లింగయ్యయాదవ్‌, కంచర్ల కృష్ణారెడ్డి, కటికం సత్తయ్యగౌడ్‌, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, కొండూరు సత్యనారాయణ, మాలే శరణ్యారెడ్డి పాల్గొన్నారు.

ఫ రైతులు అరిగోస తీస్తున్నా వారికి పట్టదా

ఫ ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి ముందు చూపులేదు

ఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

ఫ నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట రైతు మహాధర్నా

Advertisement
 
Advertisement
Advertisement