వర్షాభావం రైతన్న ఆగం! | - | Sakshi
Sakshi News home page

వర్షాభావం రైతన్న ఆగం!

Aug 3 2026 1:01 AM | Updated on Aug 3 2026 1:01 AM

జూలైలో 34శాతం లోటు వర్షపాతం

రెండు నెలల్లో 183.2 మి.మీ. వర్షం

కొన్ని మండలాల్లో అతి తక్కువగా వానలు

పంటల దిగుబడులపై అన్నదాతల్లో ఆందోళన

నీరులేక సాగు చేయలే..

ఎనిమిదేళ్లుగా చెరువు కింద రెండు పర్యాయాలు వరిసాగు చేసేవారం. ఈ ఏడాది చెరువులోకి నీరు రాకపోవడంతో సాగు బంద్‌పెట్టాం. ఇతర రైతుల వద్ద కౌలుకు తీసుకున్న పొలంలో పత్తిసాగు చేశాం. వర్షాభావంతో దిగుబడి వస్తుందో లేదోననే భయం ఉంది.

– వెంకటయ్య, రైతు, తుర్కలపల్లి

బీడుగా వదిలేశాం..

చెరువులో నీరు లేక ఎప్పుడు సాగుచేసే పొలాలు బీడుగా పెట్టాం. చెరువులో నీరుంటే మంచిగా వరిపంట పండేది. ఈఏడాది ఏమొచ్చిందో వానలే పడతలేవు. చెరువులో నీరు లేకుండాపాయె. బోరు నుంచి నీరు ఆగి ఆగి పోస్తున్నవి. ఈ రెండు నెలలు వర్షాలు రాకపోతే చెరువులోకి నీరు రానట్టే. మేము చాలా నష్టపోతాం.

– లక్ష్మీనారాయణ, రైతు, చారకొండ

కూరగాయల సాగుపై

దృష్టి పెట్టాలి..

రైతులు తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగుచేయాలి. డ్రిప్‌, మల్చింగ్‌ పద్ధతిలో పంటల సాగుకు మొగ్గుచూపాలి. కూరగాయల సాగుపై అధికంగా దృష్టి సారించాలి. ఇప్పటికే వరిపంట సాగు చేయొద్దని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరుతడి పంటల సాగుకు ప్రణాళికలను సిద్ధం చేశాం.

– చంద్రశేఖర్‌, డీఏఓ

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఏటా నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్‌, జూలై నెలల్లోనే సమృద్ధిగా వర్షాలు కురిసేవి. ఈఏడాది మాత్రం సాధారణ వర్షపాతం సైతం నమోదు కాలేదు. జూన్‌లో మాత్రమే అక్కడక్కడ కురిసిన వానతో సాధారణ వర్షపాతం 22శాతం దాటింది. అయితే అన్ని మండలాలు, గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. ఇక జూలైలో తీవ్ర వర్షాభావం నెలకొంది. దాదాపు 34శాతం లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నైరుతి రుతుపవనాలకు రెండో అర్ధభాగమైన ఆగస్టు, సెప్టెంబర్‌లో సైతం లోటు వర్షపాతమే నమోదు అవుతుందని వాతావరణశాఖ నివేదిక ఇవ్వడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఎగువ ప్రాంతంలో సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో సాగునీటి ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరుగులు పెడుతుండటం రైతుల్లో కొంతమేర ఆనందం నింపుతోంది.

183.2 మి.మీ. వర్షపాతమే..

జిల్లాలో రెండు నెలల సాధారణ వర్షపాతం 204.6 నమోదు కావాల్సి ఉండగా.. 183.2 మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. 12శాతం లోటు వర్షపాతం నమోదైంది. గతేడాది 264.4 వర్షపాతం నమోదై సాధారణ వర్షపాతానికి మించిపోయింది. ఈసారి జూలైలో కొన్ని మండలాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. పెద్దకొత్తపల్లి మండలంలో 69 శాతం లోటు వర్షపాతం, కొల్లాపూర్‌లో 59శాతం, పెంట్లవెల్లిలో 62శాతం, ఊర్కొండలో 24 శాతం, వెల్దండలో 35 శాతం, వంగూరులో 36 శాతం, కల్వకుర్తిలో 52శాతం, అమ్రాబాద్‌లో 52శాతం, లింగాలలో 38 శాతం, బిజినేపల్లిలో 22 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్‌, తాడూరు, తిమ్మాజిపేట, బల్మూర్‌, కోడేరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement