అచ్చంపేట: జిల్లాలో సర్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌కు మరో వారం రోజుల సమయం ఉండటంతో అధికారులు వేగవంతం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 9,76,987 మంది ఓటర్లు ఉండగా.. ఈ నెల 1 నాటికి 8,31,764 ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. మొత్తం ఓటర్లలో 85.13 శాతం ప్రక్రియ పూర్తయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఆచూకీ తెలియని ఓటర్లు, ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైన వారు, మరణించిన వారు, ఇలా జాబితా నుంచి తొలగించనున్న ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
తేలిన ఓటర్ల లెక్క..
ఓటరు మ్యాపింగ్‌తో ప్రస్తుతం ఉన్న ఓట్లలో ఎంత వరకు నిజమైనవి.. ఎన్ని డూప్లికేట్ ఓట్లు అనే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 38,885, అచ్చంపేటలో 40,689, కల్వకుర్తిలో 30,012, కొల్లాపూర్‌లో 35,637 ఓట్లతో కలిపి సుమారు 1,45,223 మంది ఓట్లు లేనట్లు తేలింది. ఈ లెక్కన గతంలో ఉన్న ఓట్లలో 14.87 శాతం తగ్గినట్లే. ఇందులో మరణించిన వారు, డబుల్ ఓట్లు, ఇతర ప్రాంతాలకు వలస, సిప్టింగ్ అయిన వారు ఉన్నారు.
జాగ్రత్తగా తొలగింపు జాబితా..
ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌లో ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్న వారిని, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని, చనిపోయిన వారిని గుర్తిస్తూ.. జాబితాను అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. మరణించిన వారి వివరాలను పూర్తిగా పరిశీలించి.. ఇంటి యాజమాని లేదా కుటుంబ సభ్యుల నుంచి సంతకం తీసుకున్న తర్వాతే ఓటు తొలగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా గ్రామ సభలు నిర్వహించి.. మృతులు, వలస ఓటర్లు, ఇతర వివరాలు చదివి వినిపిస్తూ సంతకాలు తీసుకుంటున్నారు. ఇల్లు మారినా, అద్దెకు ఉండి ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయిన వారి వివరాలను ఇంటి యాజమానుల నుంచి సేకరిస్తున్నారు. రాజకీయ పార్టీల బీఎల్‌ఏల సమక్షంలో ఓట్లను తొలగిస్తున్నారు.
జిల్లాలో 85.13 శాతం డిజిటలైజేషన్ పూర్తి
తొలగింపు జాబితాలో 1,45,223 మంది ఓటర్ల వివరాలు
నిర్ధారణ కాని ఓట్లపై కుదురుతున్న అవగాహన
పోలింగ్ కేంద్రాలు తగ్గే అవకాశఽం..
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తర్వాత పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టనున్నారు. అయితే జిల్లాకు సంబంధించి ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఈ లెక్కన పోలింగ్ కేంద్రాలపై కూడా ప్రభావం పడుతుంది. సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్ని తగ్గుతాయో స్పష్టత రానుంది. తద్వారా సాధారణ ఎన్నికలతో మొదలుకొని స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఫలితాలపై ప్రభావం చూపుతోందని ఇప్పటికే పలువురు నాయకుల్లో టెన్షన్ మొదలైంది.


