నల్లమలలో ఆక్వా కల్చర్‌ సెంటర్‌ | - | Sakshi
Sakshi News home page

నల్లమలలో ఆక్వా కల్చర్‌ సెంటర్‌

Feb 13 2026 4:06 AM | Updated on Feb 13 2026 4:06 AM

నల్లమలలో ఆక్వా కల్చర్‌ సెంటర్‌

నల్లమలలో ఆక్వా కల్చర్‌ సెంటర్‌

అచ్చంపేట: నల్లమలలో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే మూడో ఆక్వా కల్చర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం అచ్చంపేట మండలం చంద్రసాగర్‌ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి కార్యక్రమం, ముదిరాజ్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.4 కోట్లతో అధునాతన టెక్నాలజీతో చంద్రసాగర్‌లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసే చేపపిల్లలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖకు రూ.3 వేల కోట్లతో బడ్జెట్‌ రూపొందిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో పదేళ్లుగా చేపపిల్లల ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది రూ.123 కోట్లతో 88 కోట్ల చేపపిల్లలు కొనుగోలు చేసి 26 వేల చెరువుల్లో వదిలినట్లు వెల్లడించారు. అంచెలంచెలుగా రాష్ట్రంలో చేపపిల్లల కొనుగోలు తగ్గించి ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ముదిరాజ్‌లకు చెరువులపై పూర్తి హక్కులు కల్పించేందుకు శాశ్వత పరిష్కారం కనుగొంటామని చెప్పారు. రాష్ట్రంలో పండుగ సాయన్న విగ్రహాల ఏర్పాటు, ముదిరాజ్‌ భవనాలను ప్రాధాన్యత క్రమంలో నిర్మిస్తామన్నారు. అచ్చంపేట ముదిరాజ్‌ భవనం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అచ్చంపేట పాలశీతలీకరణ కేంద్రం సామర్థ్యాన్ని 30 లీటర్లకు పెంచుతామన్నారు. ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేర్చేందుకు పోరాటం చేస్తామన్నారు. తనను అణగదొక్కే ప్రయత్నాలు ఎన్ని జరిగినా జంకలేదని.. మక్తల్‌లో చోటుచేసుకున్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనలో తమ ప్రమేయం లేకపోయినా రాజకీయ రంగుపులిమేలా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడతామన్నారు. అంతకు ముందు రూ.18.21 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు.

చంద్రసాగర్‌కు రెండు కాల్వలు

చంద్రసాగర్‌ ప్రాజెక్టుకు ఉమామహేశ్వరం రిజర్వాయర్‌, పెనిమిళ్ల రెండు కాల్వల ద్వారా నీరు పారుతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో 365 రోజులు నీరు నిల్వ ఉంటుందని, ఇక్కడి నుంచి అమ్రాబాద్‌కు సాగునీరు అందించేందుకు లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కాల్వల పనులు వారం రోజుల్లో మొదలవుతాయని, 13 ఎకరాల్లో ఉన్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేయడం వల్ల నీటి సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అమరేందర్‌, ఆర్డీఓ యాదగిరి, గ్రంథాయల చైర్మన్‌ రాజేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీనివానులు, అంతటి మల్లేష్‌, తహసీల్దార్‌ సైదులు, మత్స్య శాఖ ఏడీ నర్సింగ్‌రావు, వెటర్నరీ ఏడీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రూ.50 కోట్లతో వంద ఎకరాల

విస్తీర్ణంలో ఏర్పాటుకు చర్యలు

అధునాతన టెక్నాలజీతో చంద్రసాగర్‌లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం

రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement