
టీచర్లకు టెట్ టెన్షన్
ప్రభుత్వానిదే బాధ్యత
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి కోసం మినహాయింపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలి. ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – సత్యనారాయణరెడ్డి,
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
పునరాలోచన చేయాలి
సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారింది. ఉపాధ్యాయుల నియామకాలు జరిగినప్పుడు లేని నిబంధన ఇప్పుడు పెట్టడం సమంజసం కాదు. తపస్ సంఘం కేంద్ర మంత్రులను కలిసి మినహాయింపు ఇప్పించాలని వినతిపత్రం అందజేశాం.
– రాజిరెడ్డి, తపస్ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వాలు చొరవ చూపాలి
రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సా ధించాలన్న సుప్రీం నిర్ణ యం విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనిపై ప్రభుత్వాలు చొ రవ తీసుకొని ఉపాధ్యా యులకు మేలు చేకూరేలా నిర్ణయం తీసుకోవాలి.
– కృష్ణ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
కందనూలు: విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి సమూల మార్పులు చేశారు. విద్యార్హలతోపాటు వృత్తి సామర్థ్యాలను మరింతగా పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రవేశపెట్టారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కలవరపెడుతుంది. విధుల్లో కొనసాగాలన్నా.. పదోన్నతి పొందాలన్నా.. టెట్ ఉత్తీర్ణతకు రెండేళ్లు గడువు విధించడం ఆందోళనకు గురిచేస్తోంది. 2012 డీఎస్సీ ద్వారా ఎంపికై న వారు టెట్ అర్హత కలిగి ఉన్నారు. అంతకు ముందు బీఈడీ, టీటీసీతో పరీక్ష రాసి ఉద్యోగంలో చేరిన వారికి టెట్ లేకపోవడం ఇందుకు కారణమవుతోంది. ఇది ఉద్యోగ విరమణకు దగ్గరున్న.. పదోన్నతులు పొందాలనుకునే టీచర్లను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
సగానికిపైగా వారే..
జిల్లాలో మొత్తం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 752 ఉన్నాయి. ఇందులో 3,221 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా.. వీరిలో జీహెచ్‌ఎంలు 102, ఎస్జీటీలు 1,399, స్కూల్ అసిస్టెంట్లు 1,720 మంది ఉన్నారు. టెట్ రాయకుండా వృత్తిలో కొనసాగుతున్న వారే సగానికి పైగా ఉన్నారని తెలుస్తోంది. టెట్ అర్హత తప్పనిసరి కావడం, రాయని పక్షంలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ, నిర్బంధ తొలగింపు టీచర్లను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎస్జీటీలు వృత్తి ఇంక్రిమెంట్లు రావాలన్నా, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందాలన్నా డిపార్టుమెంట్ పరీక్ష రాస్తారు. అలా కాకుండా 2012కు ముందు చేరిన వారందరికీ టెట్ అర్హత నిబంధన ఉపాధ్యాయులను కలవరపెడుతోంది.
కలవరపెడుతున్న సుప్రీంకోర్టు తీర్పు
రెండేళ్లలో అర్హత
సాధించకుంటే ఇంటికే..
సీనియర్ ఉపాధ్యాయుల్లో ఆందోళన
తీర్పుపై పునరాలోచించాలని సంఘాల డిమాండ్
మినహాయింపు ఇవ్వండి..
సీనియర్ ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ రాయలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. బయోసైన్స్ ఉపాధ్యాయులు గణితం, తెలుగు పండితులు సోషల్ స్టడీస్.. ఇలా ఉపాధ్యాయులకు సంబంధం లేని సబ్జెక్టులను టెట్‌లో పెట్టి పాస్ కావాల్సిందే అనే ఆలోచన సరైంది కాదని ఉపాధ్యాయులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం అలా నిర్వహించడం లేదు. విద్యాహక్కు చట్టం కంటే ముందే ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారికి టెట్ మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, ప్రధానోపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంది. ఈ నిబంధన వ్యాయామ ఉపాధ్యాయులకు లేకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

టీచర్లకు టెట్ టెన్షన్