
హిందూ ధర్మాన్ని పరిరక్షిద్దాం
కొల్లాపూర్: హిందూ ధర్మ పరిరక్షణకు సంఘ్ శ్రేణులు కృషిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్ పాలమూరు విభాగ్ సంఘచాలక్ ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. కొల్లాపూర్‌లో కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమాన్ని సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించగా.. శిక్షణ పొందిన 356 మంది కరసేవకులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామంలో విజయదశమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ.. ధర్మ పరిరక్షణ, హిందువుల జాగృతం, దేశభక్తి వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. నిస్వార్థమైన దేశభక్తి, త్యాగనిరతి సంఘ్ కార్యకర్తల లక్షణమన్నారు. కులరహిత, ప్లాస్టిక్ రహిత, సామాజిక సమరసత నిర్మాణం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు పట్టణంలోని మాధవస్వామి ఆలయ ఆవరణలో ఆర్‌ఎస్‌ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో కరసేవకులు కవాతు నిర్వహించారు. కార్యక్రమాల్లో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎల్లేని సుధాకర్‌రావు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సహకార్యవాహ ఆగపు నాగయ్య, శ్రీనివాస్ యాదవ్, కేతూరి బుడ్డన్న, శశికాంత్, బృంగి కృష్ణప్రసాద్, రమేశ్, శేఖర్‌గౌడ్, కేతూరి నారాయణ, సాయికృష్ణగౌడ్, పురేందర్, విజయ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

హిందూ ధర్మాన్ని పరిరక్షిద్దాం