
అబద్ధాలతో పబ్బం గడుపుతున్న బీఆర్‌ఎస్
అచ్చంపేట రూరల్: రాష్ట్రంలో నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడినా బీఆర్‌ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని.. అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ ధ్వజమెత్తారు. సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్చంపేటలో జనగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించిన కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో మునిగిపోయిన నావ లాంటిది బీఆర్‌ఎస్ అని.. తామున్నామని పబ్బం గడపడానికే బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. స్థానికేతరులను సభకు తీసుకొచ్చి సక్సెస్ చేశామని చంకలు చరుచుకుంటున్నారని అన్నారు. నల్లమల టైగర్ సీఎం రేవంత్‌రెడ్డి అని స్వయంగా కల్వకుంట్ల కవితనే ఓ ఇంటర్వ్యూలో అన్నారని గుర్తుచేశారు. తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని.. ఇక్కడ స్థానికేతరులందరూ కనుమరుగయ్యారని అన్నారు. పదేళ్లు అధికారం ఇస్తే కేవలం 56 శాతమే ప్రాజెక్టులు పూర్తి చేశారన్నారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చింది కేసీఆరే అని ఆరోపించారు. అచ్చంపేట ప్రాజెక్టుకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పూర్తిచేసి తీరుతామన్నారు. పదేళ్ల బాకీ కార్డులతో తామూ ప్రజల ముందుకెళ్తామన్నారు. ప్రజాపాలన సజావుగా సాగుతుంటే.. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో కేవలం 9వేల ఎకరాలకు సాగునీరు అందించి.. 90వేల ఎకరాలు అని అనడం సరైంది కాదన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్ వస్తే లెక్కలు చూపిస్తామన్నారు. అబద్ధమని తేలితే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. సమావేశంలో గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, నాయకులు మల్లేష్, గోపాల్‌రెడ్డి, గిరివర్ధన్‌గౌడ్, సీఎం రెడ్డి, నర్సింహారావు, రామనాథం, రాజగోపాల్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.