
పక్కాగా ఎన్నికల నియమావళి అమలు
● నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్: జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని.. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా ఎన్నికల అథారిటీగా వ్యవహరిస్తున్న కలెక్టర్ సంతోష్.. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుందన్నారు. జిల్లాలో కొత్త ప్రాజెక్టుల మంజూరు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఏవీ చేపట్టరాదన్నారు. ప్రభుత్వ నిధుల వినియోగం, అధికారిక వేదికలపై రాజకీయ ప్రసంగాలు జరగకూడదని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు అందించే సేవలు మాత్రం ఆగకూడదని తెలిపారు. నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి కలెక్టర్ వరకు, కాంట్రాక్టు సిబ్బంది సహా ప్రతి ఒక్కరూ ఎన్నికల ఠికమిషన్ ఆదేశాల ప్రకారం పనిచేయాలని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజకీయ నాయకుల కార్యక్రమాల్లో పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో పారదర్శకత, నిష్పక్షకతతో ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో ప్రచార పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, గోడ రాతలను తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో ఏర్పాట్లు పూర్తి..
జిల్లాలో స్ధానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. జిల్లాలో మొదటి విడత 109 ఎంపీటీసీ, 9 జెడ్పీటీసీ స్థానాలకు (బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తిమ్మాజిపేట, తాడూరు, తెలకపల్లి, కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూర్ మండలాల్లో) ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రెండో విడత 105 ఎంపీటీసీ, 11 జెడ్పీటీసీ స్థానాలకు (అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, పదర, ఉప్పునుంతల, చారకొండ, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో) ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. అదే విధంగా గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తిమ్మాజిపేట, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లోని 151 జీపీల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. రెండో విడతలో అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, పదర, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లో 158 జీపీలు, మూడో విడతలో కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూర్, తాడూర్, తెలకపల్లి మండలాల్లో 151 జీపీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ మేరకు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతో పాటు ఎన్నికల సిబ్బందికి మొదటి విడత శిక్షణ తరగతులు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. వీసీలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు కలెక్టర్ దేవ సహాయం, డిప్యూటీ కలెక్టర్లు కె.హర్షవర్ధన్, టి.అశోక్, డీపీఓ శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
● ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ఏ విధమైన నిర్లక్ష్యం ప్రదర్శించరాదని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 51 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.