భూపాలపల్లి అర్బన్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనులో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. శనివారం మధ్యాహ్నం నుంచి బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాకేంద్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్–1, 2 ప్రాజెక్ట్‌లలో పని స్థలాల వద్ద వరద నీరు వచ్చి చేరింది. రోడ్లు పూర్తిగా బురదమయమయ్యాయి. దీంతో బొగ్గు, మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు రోజుల్లో కలిసి సుమారు 10వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గనిలోకి చేరిన వరద నీటిని భారీ మోటార్ల సహాయంతో బయటికి పంపిస్తున్నారు.


