ములుగు: సర్పంచ్‌ల ఫోరం జిల్లా కన్వీనర్‌గా ముసినపల్లి కుమార్‌గౌడ్‌ను నియమించినట్లు తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం, గ్రామీణ స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కన్వీనర్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల సర్పంచులను సమన్వయం చేస్తూ వారి సమస్యలను తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. కాగా కుమార్ గౌడ్ నియామకంపై జిల్లాలోని పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
‘ప్రేరణ’కు మోడల్ స్కూల్ విద్యార్థిని ఎంపిక
ములుగు రూరల్: భారత ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రేరణ కార్యక్రమానికి పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ బండారుపల్లి విద్యార్థిని హర్షిత ఎంపికై నట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సింగారం దేవకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత యువతకు స్ఫూర్తినిచ్చే ప్రేరణ కార్యక్రమానికి విద్యార్థిని ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షితను అభినందించారు.
నిషేధిత భూముల జాబితాపై విచారణ జరపాలి
ములుగురూరల్: 22ఏ నిషేధిత భూముల జాబితాపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిప్రతం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరామ్ మాట్లాడుతూ 2014కు ముందు 22ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల పూర్తి వివరాలు వెల్లడించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏలో కొత్తగా చేర్చిన భూములు, తొలగించిన భూముల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జవహర్ లాల్, కృష్ణాకృపాకర్, రవీంద్రచారి, రాజ్ కుమార్, సుమలత, జనార్దన్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సోమవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ప్రతీ గదిని సందర్శించిన ఎమ్మెల్యే పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. సుమారు 242 మంది విద్యార్థులకు వసతి కల్పించే ఈ హాస్టల్ నిర్మాణాన్ని వేగవంతం చేసి సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. భవన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. నిర్మాణం పూర్తయిన అనంతరం హాస్టల్ చుట్టూ ప్రహరీతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు కేటాయించి విద్యార్థులకు మెరుగైన వసతి వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.


