అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాధనం దుర్వినియోగం
మంగపేట : మండల కేంద్రంలో చేపట్టిన నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోిపించిందని.. సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం వెనుక అంతర్యం ఏంటని బీజేపీ జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆదివారం బస్టాండ్‌లో చేపట్టిన పనులను ఎడవెళ్లి సాయికుమార్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి సీతక్క బస్టాండ్ నిర్మాణానికి రూ.52లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో పనులను ప్రారంభించగా ఇటీవల అదనంగా మరో రూ.11లక్షలు మంజూరయ్యాయన్నారు. అగ్రిమెంటు గడువు ముగిసి 8 నెలలు గడుస్తున్నా కాంట్రాక్టర్ నేటి వరకు పనులు పూర్తి చేయలేదని, అధికారుల పర్యవేక్షణ లేక నిర్మాణ పనుల్లో లోపాలు కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బస్టాండ్ ప్రాంగణంలో కాంట్రాక్టర్ మొరానికి బదులు మట్టిని నింపి చేతులు దులుపుకున్నాడని ప్రశ్నించారు.ఈ విషయంపై మంత్రి సీతక్క, కలెక్టర్ స్పందించి బస్టాండ్ నిర్మాణంలో నాణ్యతగా పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఆ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు రాంకీ, గోపాలకృష్ణ ఉన్నారు.


