కిలో దాటట్లే..
చెరువుల్లో ఎదగని చేపపిల్లలు
ఏటూరునాగారం: జిల్లావ్యాప్తంగా చెరువుల్లో పోసిన చేపపిల్లలు ఎదగడం లేదు. ఏ చెరువులోనూ కిలోకు మించి చేపలు పెరగలేదు. చేప పిల్లలను మత్స్యశాఖ ద్వారా అందజేసే కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మకై ్క నాసిరకం చేప పిల్లలను అంటగట్టి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది.
38 సొసైటీలకు ఉచితంగా పంపిణీ
జిల్లాలో 9 మండలాల్లో 38 సొసైటీలు ఉండగా.. 997 మంది గిరిజన సొసైటీ మత్స్యకారులు ఉన్నారు. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి నూటికి నూరుశాతం చేప పిల్లలను ఉచితంగా అందజేస్తోంది. దీంతో జిల్లాలోని 38 గిరిజన సొసైటీలకు చేప పిల్లలు పంపిణీ చేశారు. 9 మండలాలకు చెందిన 38 గిరిజన సొసైటీల్లోని 997 మంది గిరిజనులకు ఉపాధి కల్పించే విధంగా ఐటీడీఏ, మత్స్యశాఖ ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. చెరువుల విస్తీర్ణం బట్టి 50 వేల నుంచి 1.5లక్షల వరకు చేప పిల్లలను అందజేయడంతోపాటు వాటి పెంపకం బాధ్యతను గిరిజన సంఘాలకు అప్పగించారు. కానీ ఎక్కడ కూడా చేపపిల్లల ఎదుగుదల లేదని గిరిజన సొసైటీల సభ్యులు వాపోతున్నారు. దీనివల్ల ఆర్థిక ఫలాలను పొందాల్సిన తమకు దిగుబడి రాక ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. గిరిజన సొసైటీలకు అందించే చేపపిల్లలు నాసిరకమా లేకా.. నాణ్యతగా ఉన్నాయా అని మత్స్యశాఖ అధికారులు పరిశీలించిన తర్వాతనే వాటిని సభ్యులకు పంపిణీ చేస్తారు. కానీ చేప పిల్లల పంపిణీ కోసం కాంట్రాక్టు దక్కించుకున్న దళారులు కాసులకు కక్కుర్తి పడి నాసిరకం సీడ్ చేప పిల్లలను తెచ్చినట్లుగా తెలుస్తోంది.
నాసిరకం ఫిష్ సీడ్ పంపిణీ
నాణ్యతలేని వాటికి మత్స్యశాఖ ఆమోదం
గిరిజన సొసైటీ సభ్యులకు అన్యాయం
పట్టించుకోని ఐటీడీఏ అధికారులు
మండలాలు సొసైటీల సభ్యులు
సంఖ్య
ములుగు 1 13
వెంకటాపురం(ఎం) 1 88
గోవిందరావుపేట 2 102
కన్నాయిగూడెం 7 209
తాడ్వాయి 10 260
ఏటూరునాగారం 4 77
వాజేడు 2 27
వెంకటాపురం(కె) 1 24
మంగపేట 10 197
మొత్తం 38 997
ఈ ఫొటోలోని చెరువులు మంగపేట మండలం మల్లూరులోని అత్త చెరువు..కోడలు చెరువు. ఇందులో 98వేల వరకు చేప పిల్లలను వదిలారు. కానీ అవి పెరగడం లేదు. ఎదుగుదల లేక దిగుబడి రాక గిరిజన సొసైటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. ఈ చెరువుల్లో చేప పిల్లలను వదిలి నెలలు దాటుతున్నా ఇంత వరకు కావాల్సిన మోతాదులో బరువు పెరగడం లేదని ఆ సంఘం సభ్యులు జిల్లా మత్స్యశాఖ అధికారులకు లేఖ కూడా రాశారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి సమాధానం, స్పందన లేదు. చేసేదేమీ లేక గిరిజనులు చూస్తూ ఉండిపోయారు. మత్స్యశాఖ అధికారులు కక్కుర్తిపడి గుడ్డిగా కాంట్రాక్టర్‌కు అప్రూవల్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో గిరిజనులకు తీరని అన్యాయం జరిగింది.
నేరుగా కొనుగోలు చేస్తాం..
చేప పిల్లలను సొసైటీలద్వారా తామే నేరుగా కొనుగోలు చేసే అవకాశం కల్పించాలి. దీంతో మాకు కావాల్సిన రకం, నాణ్యతను పరిగణలోకి తీసుకుంటాం. ప్రభుత్వం ఇచ్చే చేపపిల్లలు నాసిరకంగా కావడం వల్ల మా కష్టం వృథా అవుతుంది. సంఘాలే నేరుగా కొనుగోలు చేసే అవకాశం కల్పించి ఉంటే ఇలాంటి పొరపాట్లు ఉండవు. ఇప్పుడు చేప పిల్లలను ఉచితంగా ఇచ్చినట్లే కానీ ఎలాంటి ఫలితం లేదు. ఆర్థిక ఫలాలు అందించే అవకాశం లేదు.
– ఈసం సారయ్య,
శివాపురం, ఏటూరునాగారం
కిలో దాటట్లే..


