హేమాచల క్షేత్రంలో సందడి
● సౌకర్యాలు లేక భక్తుల ఇబ్బందులు
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి క్షేత్రం ఆదివారం మేడారం భక్తులతో సందడిగా మారింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
జాతరను తలపించేలా..
మేడారం మహాజాతర సమీపిస్తుండటంతో వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు హేమాచలుడిని కూడా దర్శించుకుంటున్నారు. దీంతో ఉదయం ఆరు గంటల నుంచే చింతామణి జలపాతం వద్ద భక్తుల సందడి నెలకొంది.
భక్తి శ్రద్ధలతో పూజలు
ఆలయ అర్చకులు రాజశేఖర్‌శర్మ, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు.
సౌకర్యాలు కరువు
సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఆలయానికి వచ్చే భక్తుల నుంచి వివిధ రకాల అర్చనలు, నాభిచందన ప్రసాదం, శాశ్వత పూజ పేరిట రుసుము వసూలు చేస్తున్నారే తప్ప.. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. కనీసం తీర్థ ప్రసాదాలు ఇవ్వడం లేదని భక్తులు అంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


