తాగునీటికి తండ్లాట
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల కేంద్రంలోని ఊరట్టం కాలనీవాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు మహిళలు ఆదివారం తాగునీటి కోసం చేతిపంపు వద్దకు వెళ్లి బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023లో ఊరట్టం కాలనీలో ఇంటింటికీ మిషన్ భగీరథ పైపులైన్లు వేశారని తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు చుక్కనీరు వచ్చిన దాఖలాలు లేవని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోతున్నారు. పేరుకే మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని అధికారులు గొప్పలు చెబుతున్నారే తప్పా చుక్కనీరు కూడా రావడం లేదని ఆవేదర వ్యక్తం చేస్తున్నారు. దీంతో తాగునీటి కోసం చేతి పంపులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.


