
యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు
కాటారం: యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. ఎస్పీ కిరణ్‌ఖరే ఆదేశాల మేరకు కాటారం మండలం కొత్తపల్లిలో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగార్జునరావు ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. అనుమానితుల వివరాలు అడిగి తెలుసుకొని నమోదు చేసుకున్నారు. సరైన పత్రాలు, నంబర్‌ప్లేట్ లేని 12 బైక్‌లు స్వాధీన పర్చుకున్నారు. ఇద్దరు వ్యక్తుల వద్ద 40 లీటర్ల గుడుంబబా, 600 లీటర్ల బెల్లంపానకం గుర్తించి ధ్వంసం చేసి కేసులు నమోదు చేశారు. అనంతరం డీఎస్పీ గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి రవాణా చేసినా విక్రయించినా, సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. గంజాయి, గుడుంబా నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని.. వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 100కు సమాచారం అందించాలని కోరారు. భూ సంబంధిత గొడవలను ఆసరా చేసుకొని అమాయకులను మోసంచేసే వారిపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సీఐతో పాటు ఎస్సైలు శ్రీనివాస్, మహేందర్, ఓంపాల్, మహేశ్, మానస, సివిల్, టీజీఎస్పీ పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కాటారం డీఎస్పీ సూర్యనారాయణ