
ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరి
● వైఆర్‌జీ కేర్ లింక్ సంస్థ వర్కర్ కిషన్
గోవిందరావుపేట: ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వైఆర్‌జీ కేర్ సంస్థ లింక్ వర్కర్ టి.కిషన్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు శనివారం తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారుగా 90 మందికి హెచ్‌ఐవీ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ నాలుగు విధాలుగా మానవులకు సోకుతుందన్నారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషితమైన సూదులు, పరీక్షించని రక్త మార్పిడి, హెచ్‌ఐవీ తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకి ఈ నాలుగు మార్గాల ద్వారానే వస్తుందని తెలిపారు. గర్భిణులు తప్పకుండా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలన్నారు. ఒకవేళ హెచ్‌ఐవీ అని తేలితే పుట్టబోయే బిడ్డకు ఎయిడ్స్ సోకకుండా మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. గర్భిణులు తప్పకుండా ఆస్పత్రిలోనే ప్రసవం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.