
వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ఏటూరునాగారం: డైలీవేజ్ వర్కర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎండి.దావూద్ అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు పాత పద్ధతిలోనే కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, జీతాలు తగ్గించే జీవో నంబర్ 64 ను వెంటనే రద్దు చేయాలని చేస్తున్న నిరవధిక సమ్మె శనివారానికి 9వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎండి.దావూద్ మాట్లాడుతూ వర్కర్లు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించలేదన్నారు. ఇప్పటికే కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని వివరించారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. దసరా పండుగ సమీపిస్తుంటే హాస్టల్ వర్కర్లు మాత్రం ఆరు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. కార్యక్రమంలో నాగలక్ష్మి, జయలక్ష్మి, భాగ్యలక్ష్మి, కమల పాల్గొన్నారు.