
భూ సేకరణకు రైతులు సహకరించాలి
● ఆర్డీఓ వెంకటేశ్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర మాస్టర్‌ప్లాన్ అభివృద్ధి పనులు, భూ సేకరణకు రైతులు సహకరించాలని ఆర్డీఓ వెంకటేశ్ అన్నారు. మండల పరిధిలోని మేడారంలో గల ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లోని సమావేశ మందిరంలో భూ సేకరణపై బాధిత రైతులతో ఆయన శనివారం సమావేశం అయ్యారు. భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులకు 20 ఎకరాల స్థలం అవసరమని గుర్తించి రైతులతో ఆర్డీఓ వెంకటేశ్ మాట్లాడారు. రైతులు ముందుగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే అభివృద్ధి పనులకు మాస్టర్ ప్లాన్ డిజైన్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ వెనకాల అభివృద్ధి పనులకు భూమి అసరవమని రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకరిస్తే భూ ధరలను వారి డిమాండ్ మేరకు ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేస్తామన్నారు. భూమికి బదులు భూమి కూడా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల స్థలాల్లో అభివృద్ధి నిర్మాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడితే భూములు ఇచ్చిన భాదిత రైతుల ఉపాధి కోసం కేటాయించేందుకు సిద్దమన్నారు. గతంలో ఆర్టీసీ బస్టాండ్ వెనుకల క్యూలైన్ల నిర్మాణానికి భూమి తీసుకుని దానికి బదులు మేడారంలోని స్థలం కేటాయించిన ఇప్పటి వరకు ఎలాంటి భూమిపై హక్కు పత్రాలను ఇవ్వలేదని బాధిత రైతులు ఆర్డీఓకు వివరించగా సర్వే నిర్వహించి వెంటనే పంచానామ చేసి భూమి కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చివరికి బాధిత రైతులు మాత్రం భూములు ఇస్తే ఉపాధి కోల్పోతామని భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. రైతులందరితో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు ఆర్డీఓ వివరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సురేష్‌బాబు ఉన్నారు.