వెంకటాపురం(ఎం): పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్య విలువలు విద్యార్థులకు తెలుస్తాయని వెంకటాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రాధిక తెలిపారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ పదవులకు శనివారం ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం రాధిక మాట్లాడుతూ ఎన్నికల్లో విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యేందుకు పోటీలో ఉన్న విద్యార్థులతో నామినేషన్ల నుంచి ఫలితాలను ప్రకటించే వరకు ఎన్నికల నియమావళిని పాటించినట్లు వివరించారు. ఎన్నికల్లో స్టూడెంట్ కౌన్సిల్ లీడర్లుగా బాలుర నుంచి సృజన్ 42 ఓట్లతో, బాలికల నుంచి వర్షిణి 26 ఓట్లతో విజయం సాధించారని పేర్కొన్నారు. ఎన్నికల్లో విద్యార్థులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. పదవి అనేది హక్కుగా కాకుండా బాధ్యత, సేవతో పనిచేయాలని సూచించారు. భవిష్యత్‌లో భావిభారత పౌరులుగా, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎండీ. ఫరీనా బేగం, ఉపాధ్యాయులు జనగాం బాబురావు, ఫిరోజ్, కిరణ్ కుమార్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.