
రామప్పలో విదేశీయుల సందడి
వెంకటాపురం(ఎం): హైదరాబాద్‌లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 30 మంది విదేశీయులు శిక్షణలో భాగంగా శనివారం రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని ఇరాక్, పాలస్తీనా, అర్మేనియా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్, ఈజిప్ట్, దక్షిణ సూడాన్, జిబౌటి, ఉగాండా, టాంజానియా, కెన్యా, కోట్ డివోయిర్, గాంబియా, లైబీరియా, ఘనా, మొజాంబిక్, జాంబియా, నమీబియా, మారిషస్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, సురినామ్ దేశాలకు చెందిన 30 మంది మీడియా ప్రతినిధులు, అధికారులు ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమా శంకర్‌లు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటీఫుల్ అంటూ కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి బోటింగ్ చేశారు.