
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
ములుగు రూరల్ : అట్రాసిటి కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించాలని కలెక్టర్ టీఎస్ దివాకర పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అట్రాసిటి కేసుల నమోదు, పురోగతి, బాధితులకు పరిహారం అందే విధంగా అధికారులు కృషిచేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను సందర్శిస్తున్నామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన బోరుబావులను అర్హులైన లబ్ధిదారులకు అందించామని వెల్లడించారు. అలా గే మానిటరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ కమ్యూనిటీ భవనం నిర్మించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ప్రాధాన్యం కల్పించాలన్నారు. అనంతరం డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. అట్రాసిటి కేసుల విషయంలో త్వరగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్ పరిష్కారం అయిన కేసులు, విచారణలో ఉన్న కేసులను వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ నాయక్, మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు జన్ను రవి, రాంబాబు, నరేందర్, కృష్ణ, రామునాయక్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.
యువతపైనే దేశ భవిష్యత్..
దేశ భవిష్యత్ యువత, విద్యార్థులపైనే ఉందని కలెక్టర్ దివాకర అన్నారు. మండలంలోని బండారుపల్లి మోడల్ స్కూల్ పీఎంశ్రీ పథకంలో ఉత్తమ పాఠశాల ఎంపిక కావడంతో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్‌తో కలిసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలని కోరారు. పీఎంశ్రీ నిధులను పాఠశాల అవసరాల నిమిత్తం ఖర్చు చేసి జిల్లాలో ఉత్తమ పాఠశాలగా నిలిపినందుకు పాఠశాల ప్రిన్సిపాల్ దేవకి, ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. ఇందులో భాగంగా పాఠశాలకు మంజూరైన సంగీత పరికరాలను విద్యార్థులకు అందించారు. మండల విద్యాశాఖ అధికారి తిరుపతి, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు అర్షం రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు
వెంకటాపురం(ఎం) : ఫర్టిలైజర్ దుకాణదారులు ఎరువుల కృత్తిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దివాకర హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, కొనుగోలు, అమ్మకాల రిజిస్టర్‌ను పరిశీలించారు. ఎరువులు, పురుగు మందులను రైతులకు సరిపడ అందుబాటులో ఉంచాలన్నారు. వ్యవసాయ అధికారులు నిరంతరం ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని సూచించారు.అనంతరం మండల కేంద్రంలోని, పాలంపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరీక్షించారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. రామప్ప సరస్సును పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా వెంకటాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. కార్యక్రమాల్లో ఏఓ శైలజ, ఎంఈఓ ప్రభాకర్, ఇరిగేషన్ డీఈ రవీందర్‌రెడ్డి, పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీకాంత్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ దివాకర

బాధితులకు సత్వర న్యాయం అందించాలి